దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 కార్యకలాపాలను టెర్మినల్ 2, 3కు మారుస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం తీవ్రగాలులతో భారీ వర్షం కురవడంతో టర్మినల్ 1లోని కెనొపి(పందిరి) కూలింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏల్) ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం టెర్మినల్ 1 కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. టెర్మినల్ 1 ద్వారా నిర్వహించే విమాన సర్వీసులను టెర్మినల్ 2, 3కు మారుస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇండిగో శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ..‘శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దిల్లీ టెర్మినల్ 1 నుంచి వచ్చిపోయే సంస్థ విమానాలు టెర్మినల్ 2, 3కి షెడ్యుల్ చేయబడ్డాయి. ప్రయాణికులు ఏ టెర్మినల్ వద్దకు రావాలో వాట్సప్, ఎస్‌ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తాం. దయచేసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి’ అని చెప్పింది.
ఇదీ చదవండి: 350 మందికి రూ.1 కోటికి పైగా వేతనం ఇస్తున్న కంపెనీ
ప్రమాద ఘటనకు సంబంధించి డీఐఏల్ స్పందిస్తూ..‘దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అగ్నిమాపక, వైద్య బృందం ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ కార్యకలాపాలను మొదలు పెట్టింది. టెర్మినల్ 1 నుంచి ప్రయాణికులను ఇతర ప్రదేశానికి తరలించాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), దిల్లీ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) సహా అన్ని సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాం. కెనొపి కూలిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయాలైన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం’ అని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment