చెన్పై, సాక్షి: రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో్ పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 16న మొదలైన పండుగల సీజన్ నవంబర్ చివరి వారం వరకూ కొనసాగినట్లు తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ పండుగల సీజన్‌లో 10-11 శాతం అధికంగా 2.33 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది గత 4-5 ఏళ్లలో అధికమని చెప్పారు. వీటిలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరినట్లు చెప్పారు. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు.
రేనాల్ట్ సైతం
నవరాత్రి రోజులలో 5,000 కార్లు, ధన్‌తేరాస్, దీపావళిలలో 3,000 కార్లు చొప్పున విక్రయించినట్లు రేనాల్ట్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్-19కు ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం డిమాండ్ కనిపించినట్లు తెలియజేశారు. గ్రామీణవాసులు, రైతులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడంతో ఇది సాధ్యపడినట్లు వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలుదారులు, ఇతరులతో కలిపి క్విడ్, ట్రైబర్‌లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిన వర్షపాతంతో రబీ పంటల దిగుబడి 6 శాతం అధికంగా 152 మిలియన్ టన్నులకు చేరినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధరను పెంచడంతో ఖరీఫలోనూ పంటలసాగు 95 మిలియన్లు పెరిగి 1100 మిలియన్ హెక్టార్లకు చేరినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment