న్యూఢిల్లీ: వార్షిక ప్రాతిపదికన గత నెలలో డీమ్యాట్ ఖాతాలు 31 శాతం జంప్ చేశాయి. 11 కోట్లకు చేరాయి. ఖాతాలు సులభంగా తెరిచే వీలు, ఆర్థికంగా పొదుపు పుంజుకోవడం, ఈక్విటీ మార్కెట్ల రిటర్నులు మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయి. వెరసి జనవరిలో 22 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా జత కలిశాయి.
2022 డిసెంబర్‌లో ఇవి 21 లక్షలు కాగా.. అక్టోబర్, నవంబర్‌లలో 18 లక్షలు, సెప్టెంబర్‌లో 20 లక్షలు చొప్పున ఖాతాలు పెరిగినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గత నాలుగు నెలలతో పోలిస్తే జనవరిలో వేగం పుంజుకున్నప్పటికీ 2021–22లో నమోదైన సగటు 29 లక్షలతో పోలిస్తే వెనకడుగే. 2022 జనవరిలో నమోదైన 8.4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు 2023 జనవరికల్లా 11 కోట్లకు ఎగశాయి.
కారణాలున్నాయ్..
క్లయింట్లకు ఖాతాలు తెరిచే విధానాలను బ్రోకింగ్ సంస్థలు సరళతరం చేయడం, ఈక్విటీ మార్కెట్లు లాభాలు అందించడం వంటి అంశాలు ఏడాది కాలంలో డీమ్యాట్ జోరుకు సహకరించాయి. ఆర్థిక అంశాలపై అవగాహన, యువతలో ట్రేడింగ్‌పట్ల పెరుగుతున్న ఆకర్షణ వంటివి సైతం ఇందుకు జత కలిసినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది.
అయితే గత ఏడు నెలలుగా స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ డీమ్యాట్ ఖాతాల్లో వృద్ధి నమోదుకావడం గమనార్హం! జనవరిలో ఎన్‌ఎస్‌ఈ యాక్టివ్ ఖాతాల సంఖ్య 3 శాతం క్షీణించి 3.4 కోట్లకు పరిమితమైంది. వెరసి వరుసగా ఏడో నెలలోనూ యాక్టివ్ అకౌంట్లు నీరసించాయి. అయితే 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 2.7 శాతం పుంజుకుంది. ప్రస్తుతం జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ టాప్–5 డిస్కంట్ బ్రోకర్స్‌గా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ మొత్తం యాక్టివ్ క్లయింట్లలో 59 శాతానికిపైగా వాటాను ఆక్రమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment