నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్‌ | DIIs stake in Nifty 500 down to 7-quarter low of 14.3 percent | Sakshi
Sakshi News home page

నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్‌

Published Thu, May 13 2021 2:00 AM | Last Updated on Thu, May 13 2021 2:00 AM

DIIs stake in Nifty 500 down to 7-quarter low of 14.3 percent - Sakshi

ముంబై: దేశీ స్టాక్స్‌లో ఓవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్‌(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్‌పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్‌పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం..

క్యూ3తో పోలిస్తే
వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) తో పోలిస్తే ఎఫ్‌పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్‌పీఐలు 7.3 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

రంగాల వారీగా
గత రెండు త్రైమాసికాలలో ఎఫ్‌పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్‌ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్‌ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్‌కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్‌పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్‌–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్‌పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్‌లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్‌ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి.

విలువ రీత్యా
నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా విలువ 593 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రయివేట్‌ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్‌ డాలర్లకు చేరగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్‌ వాటా విలువ 43 బిలియన్‌ డాలర్లను తాకగా, కన్జూమర్‌ విభాగంలో 40 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐలు 47.9% ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్‌బీఎఫ్‌సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్‌లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్‌షిప్‌ను పొందారు. డీఐఐలు క్యాపిటల్‌ గూడ్స్‌ (21.9%), ప్రయివేట్‌ బ్యాంక్స్‌(20.4%), మెటల్స్‌ (18.3%), కన్జూమర్‌ డ్యురబుల్స్‌ (17.8%), పీఎస్‌బీ(17.6%)లలో ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement