
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సమయంలో క్రికెట్ లవర్స్ అసహనానికి గురయ్యారు. అందుకు స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవల్లో అంతరాయమే కారణమని తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ సేవలు డౌన్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇతర ఆన్ లైన్ సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలు, వాటికి పరిష్కార మార్గాలు చూపే డౌన్‌డిటెక్టర్ సంస్థ 500 మందికిపై యూజర్లు ఈ అంతరాయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వినియోగదారులు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తలెత్తిన ఎర్రర్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను ట్విటర్‌లో షేర్ చేసినట్లు నివేదించింది.
డౌన్‌డిటెక్టర్‌లోని అవుట్‌టేజ్ మ్యాప్ ప్రకారం..ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్, ముంబై, చండీగఢ్‌ల నుంచి యూజర్లు ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.ఈ సాంకేతిక సమస్యలపై డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాజమాన్యం స్పందించింది. మా యాప్‌లు, వెబ్ సేవల్లో ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. సమస్యను పరిష్కరించేలా ఐటీ నిపుణుల బృందం పనిచేస్తుందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.