మార్కెట్ల నడకను ప్రతిబింబించే ప్రధాన ఇండెక్స్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో చోటు లభిస్తున్న వార్తలతో ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్.. బీమా రంగ కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ 25 నుంచీ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50కి ఈ రెండు కంపెనీలూ ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇందుకు వీలుగా భారతీ ఇన్‌ఫ్రాటెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లను నిఫ్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో దివీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ లైఫ్ కౌంటర్లకు ఆకర్షణ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
దివీస్ ల్యాబొరేటరీస్
వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో దివీస్ ల్యాబొరేటరీస్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 3315 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,335 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో దివీస్ ల్యాబ్ నికర లాభం రూ. 272 కోట్ల నుంచి రూ. 492 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు పెరిగిన విషయం విదితమే.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం జంప్‌చేసి రూ. 881 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 890 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో ఎస్‌బీఐ లైఫ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 390 కోట్లకు ఎగసింది. స్థూల ప్రీమియం 14 శాతం పెరిగి రూ. 7,640 కోట్లకు చేరిన విషయం విదితమే. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తదుపరి నిఫ్టీలో చోటు సాధించిన రెండో కంపెనీగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిలవనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment