హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 571 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 579 కోట్లతో పోలిస్తే స్వల్పంగా (సుమారు 1.5%) తగ్గింది. మరోవైపు, ఆదాయం రూ. 4,417 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 4,919 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికా మార్కెట్లో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, వృద్ధి బాటలో ఉన్న భారత్ సహా వర్ధమాన మార్కెట్లలో బ్రాండ్లు, డిజిటలైజేషన్ మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టడం తదితర అంశాల కారణంగా లాభం స్వల్పంగా తగ్గినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్‌ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ మంగళవారం విలేకరులతో వర్చువల్ సమావేశంలో తెలిపారు.
అయితే రాబోయే త్రైమాసికాల్లో ఈ పెట్టుబడుల సానుకూల ప్రభావాలు కనిపించగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమ్మకాల ఊతంతో తొలి త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించగలిగినట్లు సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అటు అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా ఉక్రెయిన్, ఇతర దేశాల్లో హెల్త్‌కేర్ నిపుణులకు కంపెనీ తరఫున అనుచిత చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎక్సే్చంజీలకు డీఆర్‌ఎల్ తెలిపింది. కొన్ని దేశాలకు సంబంధించి నిర్దిష్ట పత్రాలు సమర్పించాలంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది.
దేశీయంగా స్పుత్నిక్ తయారీ..
ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నుంచి దేశీయంగా తయారైన కోవిడ్–19 టీకా స్పుత్నిక్–వి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డీఆర్‌ఎల్ బ్రాండెడ్ మార్కెట్ల సీఈవో (ఇండియా, వర్ధమాన మార్కెట్లు) ఎంవీ రమణ వెల్లడించారు. తయారీ సన్నద్ధత కోసం దేశీయంగా ఆరు కాంట్రాక్టు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రష్యాలో కోవిడ్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో స్పుత్నిక్–వి సరఫరాలో జాప్యం జరుగుతోందని, ఆగస్టు ఆఖరికి పరిస్థితి మెరుగుపడగలదని ఆయన తెలిపారు. సరఫరాను పెంచుకునేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)తో చర్చలు జరుపుతున్నట్లు రమణ పేర్కొన్నారు. భారత్‌లో తొలి 25 కోట్ల డోసులను విక్రయించేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డీఆర్‌ఎల్‌తో ఒప్పందం ఉంది.
ఉత్తర అమెరికా మార్కెట్ సింగిల్ డిజిట్..
భారత్, వర్ధమాన మార్కెట్లు, యూరప్ మార్కెట్ ఊతంతో క్యూ1లో గ్లోబల్ జనరిక్స్ విభాగం 17 శాతం వృద్ధి నమోదు చేసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయ వృద్ధి 1%కి పరిమితమైంది. కొన్ని ఉత్పత్తుల రేట్లు తగ్గించాల్సి రావడం, ఫారెక్స్ రేటు అనుకూలంగా లేకపోవడం వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ పలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అమ్మకాలు పెరగడం వంటి సానుకూల అంశాలతో డీఆర్‌ఎల్ వాటిని అధిగమించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్ ఔషధాల విక్రయాలు పెరగడంతో భారత మార్కెట్లో ఆదాయం 69% పెరిగి రూ. 1,060 కోట్లుగా నమోదైంది. క్యూ1లో దేశీయంగా డీఆర్‌ఎల్ ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది.
షేరు 11% డౌన్..: ఫలితాల నేపథ్యంలో మంగళవారం డీఆర్‌ఎల్ షేరు 11% పతనమైంది. ఒక దశలో రూ. 4,781కి క్షీణించింది. చివరికి 10.44% క్షీణతతో రూ. 4,844 వద్ద షేరు క్లోజయ్యింది.
ఐసీఐసీఐ లాంబార్డ్‌తో ‘శ్వాస్’ జట్టు
ఆరోగ్య బీమా పాలసీదారులకు నగదురహిత అవుట్‌పేషెంట్ సర్వీసులు అందించే దిశగా డీఆర్‌ఎల్ అనుబంధ సంస్థ శ్వాస్ వెల్‌నెస్‌తో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జట్టు కట్టింది. డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ’శ్వాస్’ని ముందుగా హైదరాబాద్, వైజాగ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు డీఆర్‌ఎల్ బ్రాండెడ్ మార్కెట్స్ విభాగం (భారత్, వర్ధమాన మార్కెట్లు) సీఈవో రమణ తెలిపారు. రాబోయే రోజుల్లో కీలక మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నస్టిక్ సర్వీసులు, ఫార్మసీ, బీమా మొదలైనవి పొందేలా ’శ్వాస్’ని తీర్చిదిద్దినట్లు రమణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment