
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది.
ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్‌లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్‌తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు.
బూస్టర్ డోస్‌గా స్పుత్నిక్ లైట్..
కోవిడ్‌కి సంబంధించి స్పుత్నిక్ లైట్‌ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్‌ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment