![Ecommerce sales in festive season crosses rs 61,000 crores - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/27/shoping.jpg.webp?itok=4P49dqOU)
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈకామర్స్ కంపెనీలకు మాత్రం జోష్‌నిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్‌గా పేర్కొనే ఈ కాలంలో ఆన్‌లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్‌చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ విడుదల చేసిన నివేదిక వివరాలివి. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్‌సీర్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయ్...
88 శాతం వృద్ధి
గతేడాదితో పోలిస్తే ఆన్‌లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్‌పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్‌కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది.
రూ. కోటికిపైగా
సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్‌కోడ్స్ నుంచి సెల్లర్స్‌కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది.
కారణాలివీ
భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలోనూ ఈకామర్స్ కంపెనీలు గరిష్ట స్థాయిలో వస్తువులను అందుబాటులో ఉంచడం అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బ్రాండ్లు, ఫైనాన్సింగ్ ఒప్పందాలు దీనికి జత కలసినట్లు తెలియజేసింది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ స్థాయి పట్టణాలకు పెరిగిన ఉద్యోగుల వలస, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు వంటి అంశాలు ఆన్‌లైన్ అమ్మకాలకు దోహదపడినట్లు అభిప్రాయపడింది. కొనుగోలుదారులు అటు ఖరీదైన లేదా ఇటు కారుచౌక వస్తువులకంటే అందుబాటు ధరల ఐటమ్స్‌కే మొగ్గు చూపినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment