
సామాన్యులకు ఊరట కలుగనుందా? వంట నూనె ధరలు దిగిరానున్నాయా? అంటే అవును అని అంటున్నారు కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. గత ఏడాది నుంచి 20 - 50 శాతం మధ్య పెరిగిన వంటనూనె ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి వంట నూనెల ధరలు దిగిరావొచ్చన్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గే అంచనాలు ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. "రాబోయే డిసెంబర్ నుంచి సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది" అని ఆహార & ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.(చదవండి: నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు)
పాండే మాట్లాడుతూ.. "రాబోయే రోజుల్లో సోయాబీన్ పంట కోతకు వస్తుంది. ఆ నాలుగు నెలల తర్వాత రబీ ఆవాల పంట చేతికి వస్తుంది, కాబట్టి ధరలు నియంత్రణలో ఉండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. అలాగే, కొత్త పంటల రాక, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ఆయిల్ ధరల ఇందుకు కారణం అని అన్నారు. ప్రస్తుతం 60 శాతం ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది అని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే, అప్పుడు ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పాండే అన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో వంట నూనె ధరలు 64 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం మిషన్ ఆయిల్‌పామ్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment