మిడ్‌సెషన్ నుంచీ జోరందుకున్న మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్, మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్ బిల్డ్‌కాన్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఐషర్ మోటార్స్
రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజించేందుకు బోర్డు అనుమతించిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ కౌంటర్ దూకుడు చూపుతోంది. తాజాగా ఎన్‌ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 20,916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 20,970 వరకూ ఎగసింది. వెరసి గత రెండు నెలల్లో 49 శాతం దూసుకెళ్లింది. గత నెల 12న కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల విభజనకు అనుమతించాక ఈ కౌంటర్ ర్యాలీ బాట పట్టిన విషయం విదితమే. మే 25న తొలిసారి కంపెనీ షేర్ల విభజనకు ప్రతిపాదించడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
దిలీప్ బిల్డ్‌కాన్
హెచ్‌సీసీతో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) గుజరాత్ నుంచి రూ. 4168 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టును పొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్ ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9.5 శాతం దూసుకెళ్లి రూ. 309 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 312 వరకూ ఎగసింది. కాంట్రాక్టులో భాగంగా జేవీ డీబీఎల్-హెచ్‌సీసీ భడ్‌భట్ బ్యారేజీ నిర్మాణంతోపాటు వరద రక్షణ గోడల ఏర్పాటు తదితరాలను చేపట్టవలసి ఉంటుందని దిలీప్ బిల్డ్‌కాన్ తెలియజేసింది. నర్మదా వాటర్ రీసోర్స్, గుజరాత్ నుంచి ఈ కాంట్రాక్టును పొందినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment