ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు తగిన ఫలితాలు సాధించడంతోపాటు.. ఆశావహ అంచనాల కారణంగా ఆటో రంగ కంపెనీ ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఐషర్ మోటార్స్
ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐషర్ మోటార్స్ నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 2,134 కోట్లను తాకింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 9 శాతం తక్కువగా 1,49,120 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వోల్వో గ్రూప్‌తో ఏర్పాటు చేసిన జేవీ వీఈ కమర్షియల్ వెహికల్స్ ఆదాయం 13 శాతం వెనకడుగుతో రూ. 1,703 కోట్లకు చేరింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 5.4 శాతం నుంచి 6.9 శాతానికి బలపడ్డాయి. ప్రస్తుతం నెలకు 70,000 యూనిట్ల తయారీ స్థాయికి చేరినట్లు ఐషర్ మోటార్స్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. బుకింగ్స్ సైతం 1.25 లక్షల యూనిట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో క్యూ3లో పనితీరు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,498ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..ఈ షేరు గత వారం 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! చదవండి: (అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ)
ఐబీ రియల్టీ
రాకేష్ జున్‌జున్‌వాలకు చెందిన రేర్ ఎంటర్‌ప్రైజెస్ ఓపెన్ మార్కెట్ ద్వారా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన 5 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన వీటిని గురువారం షేరుకి రూ. 57.73 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు దాదాపు రూ. 29 కోట్లను వెచ్చించినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది. కాగా.. ఇదే సమయంలో మోర్గాన్ స్టాన్లీ 7.58 మిలియన్ షేర్లను రూ. 57.73 సగటు ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ రియల్టీ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 16 శాతం దూసుకెళ్లింది. రూ. 64కు చేరింది. ప్రస్తుతం 12 శాతం లాభంతో రూ. 61.50 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 30 శాతంపైగా లాభపడటం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment