న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ అపరకుబేరుడిగా నిలిచాడు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాగాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 2023లో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ నికర విలువ 28 ఫిబ్రవరి నాటికి 187 బిలియన్ డాలర్లు. 2023లో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు లేదా 36 శాతం పెరిగింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ మొత్తం నికర విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లు. గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తాగా టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు.ఈ ఏడాదిలో టెస్లా స్టాక్ 100 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబరులో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోగా, ఆర్నాల్డ్ సంపదపెరగడంతో మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించిన సంగతి తెలిసిందే.
అటు ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 37.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ సూచీలో 32వ స్థానానికి పడిపోయాడు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూపు షేర్లన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment