
గ్లోబల్ లెవల్లో ఆటోమొబైల్ రంగం.. అందునా ఈవీ కేటగిరీలో ఆ రేంజ్ లాభాలు మరేయితర కంపెనీ సాధించలేదు. పైగా గడిచిన ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో యాభై శాతం అధికంగా వాహన ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది కూడా. అయినప్పటికీ ఈ ఏడాదిలో కొత్త మోడల్ తేలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
టెస్లా 2023 మొదటి భాగం(Q1) వరకు ఎలాంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయబోదని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచ ఆటో రంగం ఎదుర్కొంటున్న చిప్ షార్టేజ్ ఇందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. దీంతో కిందటి ఏడాది వస్తుందని భావించిన సైబర్‌ట్రక్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు 25 వేల డాలర్ల చిన్న సైజు ఎలక్ట్రిక్ కారు విషయంలో సైతం ప్రయత్నాలు ముందుకెళ్లట్లేదని, అయినప్పటికీ కారును మార్కెట్లోకి తెచ్చి తీరతామని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం చెయిన్ సిస్టమ్ సప్లయ్ సమస్యను అధిగమించడం, ప్రపంచ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై టెస్లా తన దృష్టి సారిస్తుందని ఎలన్ మస్క్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. రాడికల్ సైబర్‌ట్రక్ తో పాటు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు సైతం ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాహనాలను ప్రవేశపెడితే.. మొత్తం ఉత్పత్తిపైనే ప్రభావం పడుతుందని ఎలన్ మస్క్ చెప్తున్నారు.
కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి అదనపు వనరులను గనుక మళ్లిస్తే.. ఇతర మోడళ్లను ఉత్పత్తి చేసే సంస్థ సామర్థ్యం పరిమితం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే సైబర్‌ట్రక్, రోడ్‌స్టర్‌ల ఉత్పత్తికి మద్దతు ఇచ్చే సాధనాలను 2022లోనే మొదలుపెట్టాలనుకుంటున్నామని, వచ్చే ఏడాది నుంచి వాటి ఉత్పత్తిని ఆశిస్తున్నామని మస్క్ వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment