అసభ్యంగా తాకడం, వెకిలి సందేశాలతో ఇబ్బంది పెట్టడం.. తట్టుకోలేక ఫిర్యాదులు చేస్తే మరింతగా వేధించడం.. ఇది ప్రపంచంలోనే ఆటోమొబైల్ దిగ్గజంగా పేరున్న టెస్లాలో మహిళా ఉద్యోగులకు ఎదురవుతున్న పరిస్థితి. పైగా బాస్‌ను బట్టే ఉద్యోగులు రెచ్చిపోతున్నారంటూ విమర్శలు చెలరేగడం ఇక్కడ కొసమెరుపు.
కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ మోడల్- 3 యూనిట్‌లో పనిచేసే ఓ ఉద్యోగిణి.. ప్రొడక్షన్ అసోసియేట్ కోర్టులో ఆమధ్య టెస్లాకు వ్యతిరేకంగా దావా వేసిన విషయం తెలిసిందే. ఇది విచారణ జరుగుతుండగానే.. ఏకంగా ఆరుగురు మహిళా ఉద్యోగులు మంగళవారం(డిసెంబర్ 14, 2021) కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. ఫ్రీమాంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఐదుగురు, దక్షిణ కాలిఫోర్నియా టెస్లా సర్వీస్‌సెంటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగిణి ఇందులో ఉన్నారు. వీళ్లంతా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పరిణామంపై స్పందించేందుకు టెస్లా నిరాకరించింది.
‘టెస్లా అనేది మగ ఉద్యోగుల విలాసాలకు కేరాఫ్. కానీ, ఆడవాళ్లకు మాత్రం అదో నరక కూపం’ అని ఓ దావాలో బాధితురాలు పేర్కొంది. ఇక మస్క్ చేష్టల వల్లే ఉద్యోగులు రెచ్చిపోతున్నారంటూ మరో దావాలో బాధితురాలు పేర్కొంది. ‘బాస్‌ను బట్టే ఉద్యోగులు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేష్టల వల్లే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ఆయన చేసే ట్వీట్లు వర్క్‌ప్లేసులో రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. మాదక ద్రవ్యాలు-శృంగారం గురించి ఆయన చేసే ట్వీట్ల గురించి ఉద్యోగుల మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది. ఆయనే అలా ఉన్నప్పుడు మేం లేకుంటే ఎలా అని తెగ ఫీలైపోతున్నారు’ అని ఆ దావాలో ఉంది.
ఇక మరో దావాలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న అఘాయిత్యాల తాలుకా వివరాలను తెలిపింది బాధితురాలు. ఇష్టమొచ్చినట్లు ముట్టుకుంటున్నారు. అసభ్య సందేశాలతో ఇబ్బంది పెడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మా బాధలు వినేవారు కరువయ్యారు. ఏళ్ల తరబడి ఇది కొనసాగుతోంది’ అంటూ పేర్కొంది మరో బాధితురాలు.
టెస్లా మోడల్ వై లాంఛ్ సమయంలో.. S, 3, X, Y అనే పదాల్ని చేర్చి.. తోటి ఉద్యోగిణిని ఉద్దేశిస్తూ సెక్సీ అంటూ ఎలన్ మస్క్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తావనను కూడా ఓ బాధితురాలు తన పిటిషన్‌లో పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే టెస్లా కంపెనీ ఈమధ్య వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతోంది. తోటి ఉద్యోగుల నుంచి జాతి వివక్ష ఎదుర్కొన్న ఓ ఉద్యోగికి 137 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ జాబితాలో ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్న టెస్లాకు.. ఓవైపు ఎలన్ మస్క్ చేష్టలు(నష్టం చేకూరేలా చేస్తున్న ట్వీట్లు.. షేర్ల అమ్మకం), మరోవైపు తాజా దావాలు తలనొప్పిగా మారాయి.
చదవండి: ఎలన్ మస్క్.. ఏమైంది నీకు?
Comments
Please login to add a commentAdd a comment