ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ భారీ లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన, ఆటో, వినిమయ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. వేడిక్కిన చమురు ధరలు చల్లబడటం కలిసొచ్చింది.
ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగి 57,357 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 17,201 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. కాగా, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ నాలుగు పైసలు స్వల్పంగా బలపడి 76.60 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,174 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,644 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్ మార్చి క్వార్టర్ గణాంకాలు మెప్పించడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాభాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 862 పాయింట్లు ఎగసి 57,442 వద్ద, నిఫ్టీ 270 పాయింట్లు బలపడి 17,224 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలకు అందుకున్నాయి. కాగా, మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు మిశ్రమ స్పందన కనిపించింది.
రిలయన్స్ దూకుడు
అబుదాబీ కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (త’జీజ్)తో రెండు బిలియన్ డాలర్లు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుందనే వార్తలు రిలయన్స్ షేర్ల దూకుడు కారణమైంది. బీఎస్‌ఈలో ఉదయం ఈ షేరు అరశాతం లాభంతో రూ.2,710 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,796 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి మూడు శాతం లాభంతో రూ.2,776 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 56 లక్షల చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.18.77 లక్షల కోట్లుగా నమోదైంది. సూచీల లాభాల్లో సింహభాగం రిలయన్స్‌దే. కాగా, రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుకావడంతో ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థల షేర్లు రెండోరోజూ నష్టపోయాయి.
సూచీల ఒకటిన్నర శాతం బౌన్స్‌బ్యాక్‌తో స్టాక్ మార్కెట్లో రూ.4.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment