సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) జోరందుకుంటుండగా.. అమ్మకాలు సైతం హుషారెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం తక్కువ అవుతుండటంతో యువత ఈవీల వైపు చూస్తున్నారు. ఫలితంగా.. ఆరు నెలలుగా వీటి అమ్మకాల జోరు పెరుగుతోంది. దేశంలో తొలిసారిగా ఒక ఆర్థిక ఏడాదిలో 10 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలతో ఎలక్ట్రిక్ వాహన రంగం సరికొత్త రికార్డును సృష్టించింది.
(కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు)
2022–23లో దేశవ్యాప్తంగా 11,71,944 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు వాహన్ డేటా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021–22లో అమ్ముడైన 4,58,746 యూనిట్లతో పోలిస్తే అమ్మకాల్లో 155 శాతం వృద్ధి నమోదైంది. గడచిన ఆరు నెలలుగా ప్రతినెలా లక్షకు పైగా వాహనాలు అమ్ముడవుతున్నాయంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తు్తతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 22,67,042కు చేరింది. రాష్ట్రంలో ఈవీల సంఖ్య 54,918కు చేరింది.
టూ.. త్రీ వీలర్స్‌కే డిమాండ్ అధికం
ప్రస్తుతం అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటానే అత్యధికంగా ఉంటోంది. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు 61.5 శాతం ఉంటే, త్రిచక్ర వాహనాల వాటా 34 శాతంగా ఉంది. ద్విచక్ర వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశంతో ఒక్కసారిగా అమ్మకాలు భారీగా పెరిగాయి. 2021–22తో పోలిస్తే 185 శాతం వృద్ధితో 7,20,733 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.
(ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?)
ఇందులో ఒక్క ఓలా ఎలక్ట్రిక్ 1,54,344 వాహనాలు అమ్మడం ద్వారా 21 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఓకినావా ఆటో టెక్ 94,133, హీరో ఎలక్ట్రిక్ 89,165 నిలిచాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలకు వస్తే 2022–23లో మొత్తం 3,99,540 యూనిట్లు సేల్ అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 39,544 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరిగితే.. అందులో 31,203 కేవలం టాటా మోటర్స్ నుంచే జరగ్గా, 4,412 యూనిట్లు ఎంజీ మోటార్స్ నుంచి జరిగాయి. రాష్ట్రంలోని కియా మోటర్స్ 311 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment