అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్‌లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు.
ఇప్పటికే ఇస్తుంది కదా
సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రీ-కోవిడ్‌కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్‌పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు.
రాయితీలపై అదే మాట
కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్‌లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్‌డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు.
ఆర్‌టీఐలో ఏముందంటే?
అంతకుముందు, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment