Facebook former executive fraud: టాప్ కంపెనీలో ఉద్యోగం.. అది కూడా టాప్ పొజిషన్.. మంచి జీతం.. అయినా ఆమె బుద్ధి గడ్డి తినింది. జల్సాలు, లగ్జరీ లైఫ్ కోసం నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నమేసింది. ఏకంగా రూ.33 కోట్లకు పైగా కొట్టేసింది.
ఫేస్‌బుక్‌లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా పని చేసిన అర్బరా ఫర్లో స్మైల్స్ అనే 38 ఏళ్ల మహిళ నకిలీ విక్రేతలు, కల్పిత ఛార్జీలు, క్యాష్ కిక్‌బ్యాక్‌ల ద్వారా కంపెనీ నుంచి 4 మిలియన్లకు పైగా (సుమారు రూ. 33 కోట్లు) కొట్టేసినట్లు అంగీకరించింది. కంపెనీలో 2017 నుంచి 2021 సంవత్సరాల కాలంలో కాజేసిన ఈ డబ్బును ఆమె కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవనం కోసం ఖర్చు చేసింది.
మోసం చేసిందిలాగే..
డబ్బును కాజేసేందుకు ఫర్లో స్మైల్స్ కంపెనీ ఖర్చు ఖాతా వ్యవస్థనే మార్చేసింది. పేపాల్, వెన్మో, క్యాష్ యాప్ వంటి చెల్లింపు సేవలకు తన కార్పొరేట్ క్రెడిట్ కార్డులు లింక్ చేసుకుంది. వీటి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి సంబంధించిన చెల్లింపులకు కంపెనీ సొమ్మును వినియోగించేది. తర్వాత వారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకునేది. ఈ సొమ్మును నేరుగా, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ ద్వారా, కొన్నిసార్లు టీ షర్టుల వంటి వాటిలో దాచి ఆమెకు ఇచ్చేవారని ఈ కేసును డీల్ చేస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
ఖర్చు చేసింది వీటికే..
ఫేస్‌బుక్‌ను మోసం చేసి కాజేసిన సొమ్మును ఫర్లో స్మైల్స్ విలాసాలకు వినియోగించేది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్‌లకు భారీగా ఖర్చు పెట్టేదని తెలిసింది. పిల్లల ప్రీస్కూల్ ట్యూషన్ ఫీజుకే ఆమె 18,000 డాలర్లు (రూ.14 లక్షలకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం. నేరాన్ని బార్బరా ఫర్లో స్మైల్స్ అంగీకరించింది. దీంతో ఆమెకు వచ్చే ఏడాది మార్చి 19న శిక్ష విధించనున్నారు. అప్పటి వరకు ఆమె 5,000 డాలర్లు (రూ.4.15లక్షలు) బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment