హుషారుగా మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలాపడ్డాయి. చివరి గంటన్నర సమయంలో ఊపందుకున్న అమ్మకాలు ఇండెక్సులను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 38,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 11,440 వద్ద స్థిరపడింది. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ క్వాడ్రపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. దీంతో తొలిసెషన్‌లో సెన్సెక్స్ 400 పాయింట్లవరకూ జంప్‌చేసి 39,230ను తాకింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు పురోగమించి 11,569కు చేరింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 38,573 వద్ద కనిష్టానికి చేరింది. అంటే ఇంట్రాడే గరిష్టం నుంచి 650 పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 11,384 దిగువకు పతనమైంది.
ఐటీ జూమ్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 4.5 శాతం, రియల్టీ 3.7 శాతం చొప్పున జంప్‌చేశాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం నష్టపోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.8 శాతం స్థాయిలో నీరసించాయి. క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు తాజాగా పేర్కొనడంతో నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్ 11 శాతం దూసుకెళ్లింది. మరోపక్క యూరోపియన్ కంపెనీ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించడంతో ఇతర ఐటీ కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. వెరసి టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను దాటింది.
బ్లూచిప్స్ తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టైటన్, హీరో మోటో, శ్రీ సిమెంట్ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, గ్రాసిమ్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్, యాక్సిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ 4-2 శాతం మధ్య డీలాపడ్డాయి.
అశోక్ లేలాండ్ ప్లస్
డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, బాలకృష్ణ, బీఈఎల్, బాటా, వోల్టాస్, పీవీఆర్, మ్యాక్స్ ఫైనాన్స్, మదర్‌సన్, ఎస్కార్ట్స్, ఏసీసీ, ఐడియా 10-3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రు, భెల్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6-4 శాతం చొప్పున జంప్‌చేశాయి. ట్రేడైన షేర్లలో 1829 లాభపడగా., 927 మాత్రమే నష్టాలతో ముగిశాయి. మల్టీక్యాప్ ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడుల నిబంధనలను సెబీ సరళతరం చేయడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,176 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 724 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment