
పండుగ సీజన్‌లో సేల్స్ వస్తే తగ్గింపు ధరలు, ఉచిత డెలివరీ, స్పెషల్ ఆఫర్లు ఇలా ఎన్నో వస్తాయి. వీటిని చూసి ఎవ్వరైనా ఆకర్షితులవుతారు. కానీ అదే సమయంలో సైబర్ మోసాలకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. ఒక తప్పుడు క్లిక్ చేసినా మీ డబ్బు, డేటా లేదా ఐడెంటిటీని కోల్పోవచ్చు.
ఇప్పుడీ ఫిషింగ్ అనే మోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి నాలుగు సైబర్ దాడులలో ఒకటిగా మారింది. మన దేశంలో గత ఒక్క సంవత్సరంలోనే సైబర్ మోసాల వలన రూ.22,811 కోట్లకు పైగా నష్టం జరిగింది, కాబట్టి జాగ్రత్త! ఆఫర్ చూసి క్లిక్ చేసేముందు, అది నమ్మదగినదేనా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని గ్లోబల్ కొరియర్ సంస్థ ఫెడ్‌ఎక్స్ సూచిస్తోంది. స్కామర్లు ఉపయోగించే ట్రిక్స్, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది.
మోసాలు ఇలా ఉంటాయి..
పండుగ సీజన్‌లో స్కామర్లు వినియోగదారులను మోసగించడానికి కొన్ని సాధారణ ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఇవి సక్సెస్ అవుతాయి కూడా ఎందుకంటే.. అవి నిజమైన వాటిగా కనిపిస్తాయి. బ్రాండ్‌ల లోగోలు, అత్యవసరంగా మాట్లాడే భాష, పరిచయమైన పేర్లు వాడుతూ మిమ్మల్ని త్వరపడేలా చేస్తారు. ఆ ట్రిక్స్ ఇవే..
• "మీ ఖాతాను వెరిఫై చేయండి" అంటూ బ్యాంక్ లేదా షాపింగ్ సైట్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు పంపిస్తారు.
• కార్డ్ లేదా యూపీఐ వివరాలను దొంగిలించడానికి ఒకేలా కనిపించే వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు.
• నమ్మలేని ఆఫర్లు లేదా క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు చెబుతూ ఫేక్ యాప్స్ లేదా క్యూఆర్ కోడ్‌లు ఉపయోగిస్తారు.
• తాము కొరియర్ కంపెనీల నుంచి అన్నట్టు నటిస్తూ, "మీ పార్సల్ మధ్యలో ఆగిపోయింది" అంటూ లింక్ క్లిక్ చేయమని లేదా ఒక నంబర్‌కు కాల్ చేయమని చెబుతారు.
•వెంటనే ట్రాక్ చేయండి అంటూ ఫేక్ డెలివరీ లింక్స్‌తో వాట్సాప్/ఎస్ఎంఎస్ మెసేజ్‌లు పంపుతారు.
• “డబ్బు అందుకోవడానికి” క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని అడిగి, మీ ఖాతాలోని డబ్బును దొంగలిస్తారు.
స్కామ్‌ల బారినపడకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఆన్‌లైన్ షాపింగ్ సులభమే, అలాగే సైబర్ సురక్షితంగా ఉండడం కూడా సాధ్యం. షాపింగ్ చేస్తుంటే, స్క్రోల్ చేస్తుంటే, కోడ్ స్కాన్ చేస్తుంటే ఈ సులభమైన జాగ్రత్తలు తీసుకోండి..
• తెలియని వారి దగ్గర నుండి వచ్చిన లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకండి, నేరుగా అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లండి.
• ఎప్పుడూ వెబ్ సైట్ అడ్రస్ చూసుకోండి, నకిలీ సైట్లు చాలా సార్లు స్పెల్లింగ్ తప్పులు లేదా అదనపు పదాలు ఉంటాయి.
• ఓటిపి, పాస్‌వర్డ్స్, కార్డ్ వివరాలను ఫోన్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఎవరితోనూ పంచుకోకండి
• నమ్మకమైన పేమెంట్ యాప్స్ ఉపయోగించండి, వాటిని ఎప్పుడూ అప్డేట్ చేసుకోండి
• ఒక ఆఫర్ చాలా బాగా కనిపిస్తే, వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన అమ్మకందారులు మీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయరు.
చివరిగా..
చాలా స్కామ్‌లు అధునాతన హ్యాకింగ్‌పై ఆధారపడవు, అవి నమ్మకంపై ఆధారపడతాయి. పండుగ రద్దీ సమయంలో, ఆ నమ్మకాన్నే స్కామర్లు దోపిడీ చేస్తారు. మీరు క్లిక్ చేసే ముందు, ప్రాథమికాలను తనిఖీ చేయడానికి కొంత సమయం కేటాయించండి, సందేశం ఎవరు పంపారు? సైట్ నిజమేనా? ఇది అసాధారణంగా అనిపిస్తుందా? అన్నవి చూసుకోండి. మీరు సైబర్ మోసానికి గురైనా లేదా అనుమానం కలిగినా వెంటనే మీ స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు లేదా వెబ్‌సైట్ (cybercrime.gov.in) ద్వారా సమాచారం ఇవ్వండి.