న్యూఢిల్లీ: భారత్ వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థికశాఖ 2024 జనవరి సమీక్షా నివేదిక పేర్కొంది. నిరంతర సంస్కరణల నేపథ్యంలో 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పది సంవత్సరాల క్రితం భారత్ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 1.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వివరించింది.
ఈ అంకెలు ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరి (2023–24 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం) దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. మహమ్మారి సవాళ్లు, తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశం ఈ ఘనత సాధించిందని పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశ’గా మారాలనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని వివరించింది. సంస్కరణల ప్రయాణం కొనసాగడంతో ఈ లక్ష్యం నెరవేరుతుందన్న భరోసాను వెలిబుచి్చంది.
సమగ్ర సంస్కరణలతో జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిలలో పాలనాపరమైన మార్పులు తీసుకువచ్చినప్పుడు దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం సంపూర్ణంగా ఉంటుందని నివేదిక వివరించింది. దేశీయ డిమాండ్ పటిష్టతతో ఎకానమీ గత మూడేళ్లలో 7 శాతం వృద్ధిని సాధించిందని, 2024–25లో కూడా 7 శాతం స్థాయికి వృద్ధి చేరే అవకాశం ఉందని నివేదిక అంచనావేసింది. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్
డాలర్లు)లు ఉన్నాయి.
మౌలిక రంగం అద్భుతం
కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేనట్లు అపూర్వమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2014–15లో ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడి 5.6 లక్షల కోట్లు ఉంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 18.6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.
– వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
ఎకానమీ... లుకింగ్ లైక్ ఏ వావ్
వైరల్ మీమ్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్... భారత ఆర్థిక వ్యవస్థ శక్తిని, ఎకానమీ ప్రస్తుత చెక్కుచెదరని స్వభావాన్ని ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచంలోని అగ్ర దేశాలు నిరాశావాదంలో మునిగిపోయినప్పటికీ, భారతదేశం తిరుగులేని ఆశావాదంతో ముందుకు సాగుతోంది. ఈ విజయానికి కారణం ప్రభుత్వమే.
– కార్పొరేట్ దిగ్గజం కుమార మంగళం బిర్లా
Comments
Please login to add a commentAdd a comment