మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు | Fluctuations in the market may continue | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు

Published Mon, Nov 22 2021 12:48 AM | Last Updated on Mon, Nov 22 2021 12:48 AM

Fluctuations in the market may continue - Sakshi

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్‌–సౌదీ ఆరామ్‌కో ఒప్పందానికి బ్రేక్‌ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు  ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్‌ కేసులు తిరిగి పెరుగుతున్నాయి.

నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్‌ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి.

కార్పొరేట్ల సెప్టెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్‌లో కన్సాలిడేషన్‌(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్‌ హెడ్‌ నిరాళీ షా తెలిపారు.  

ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..?
కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు.  ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు

రిలయన్స్, సౌదీ ఆరామ్‌కో డీల్‌ కు మంగళం
రిలయన్స్‌ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్‌ పడింది. సౌదీ అరామ్‌కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్‌ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్‌ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్‌ డాలర్లను సమీకరించాలని రిలయన్స్‌ భావించిన సంగతి తెలిసిందే.  

గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు  
ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్‌ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement