కరోనా కష్టకాలంలోనూ జనాల ఆకలి కంటే అణ్వాయుధాల ప్రదర్శనే ముఖ్యమనుకున్న నియంతాధ్యక్షుడి స్వరం మారింది. మొన్నటిదాకా ఆర్భాటాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టిన కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు పొదుపు మంత్రం వల్లె వేస్తున్నాడు. కరోనా భయంతో తనను తాను బయటి ప్రపంచంతో బంధాలు తెంచుకుని బంధించుకున్న ఉత్తర కొరియాలో ఆహార కొరత ఏ స్థాయిలో ఉందో కిమ్ ప్రసంగం గురించి తెలుసుకుంటే సరిపోతుంది మరి!
పదేళ్ల అధికార ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా.. పార్టీ కీలక సమావేశం నిర్వహించాడు కిమ్ జోంగ్ ఉన్. పెరిగిపోతున్న ఆకలి మరణాలు(లక్షల్లో!), ఆహార కొరతను అధిగమించడం, ప్రజలకు పోషకారహారం అందించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగడం విశేషం. మరోవైపు పతనం దిశగా దూసుకెళ్తున్న ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా గాడిలో పెట్టాలని, ఇది జాత్యవసర అంశమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పార్టీ నేతలను.. అధికారులను ప్రసంగించాడు. అంతేకాదు ప్రత్యేకంగా ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఇక ఈ సమావేశంలో ప్రసగించిన కిమ్.. బాగా చిక్కిపోయి కళ తప్పిన ముఖంతో ఉన్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
జీవన ప్రమాణాలే..
2021లో ఉత్తర కొరియా పౌరులు ఎంతటి తీవ్ర దుస్థితి, సంక్షోభాలు ఎదుర్కొన్నారో తనకు తెలుసని, అందుకే ఆ ఏడాదిని గడ్డు కాలంగా పేర్కొన్నాడు ఉత్తర కొరియా సుప్రీం. 2022ను గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్(జీవన్మరణ పోరాట)గా అభివర్ణించాడు. రాబోయే రోజుల్లో ఆహార, వస్త్ర పరిశ్రమతో పాటు గృహ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించి.. అభివృద్ధి దిశగా కృష్టి చేయాలంటూ అధికారుల్లో మనోధైర్యం నింపాడు. అంతేకాదు మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ప్రధానాంశంగా ముందుకెళ్లాలంటూ అధికారులకు సూచించాడు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల నిధుల కేటాయింపులకు కోతలు విధించినా ఫర్వాలేదని, అంతా పొదుపు పాటించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చడమే ధ్యేయంగా పని చేయాలంటూ పిలుపునిచ్చాడు కిమ్.
కారణాలు..
కరోనా సమయంలో ఉత్తర కొరియా ఆహార సంక్షోభం మొదలైంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు చేపట్టకుండా.. న్యూక్లియర్ వెపన్స్ తయారీ ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ ఐక్యరాజ్య సమితి నార్త్ కొరియా అధ్యక్షుడిపై దుమ్మెత్తి పోసింది. కరోనాకు తోడు కరువు, భారీ వర్షాలు, వరదలు.. కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి సంక్షోభం దిశగా పయనించింది. ఈ మొత్తం పరిణామాలతో మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!.
ఆశ్చర్యకర పరిణామం
సుదీర్ఘంగా సాగిన కిమ్ ప్రసంగంలో దేశ సమస్యల ప్రస్తావనే కనిపించింది. గ్రామీణాభివృద్ధి ప్రణాళిక, పోషకాహారం, పిల్లల యూనిఫామ్స్, నాన్-సోషలిస్టిక్ కార్యకలాపాల్ని అణివేయడం తదితర అంశాలపైనే సాగింది. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ చేసే ప్రసంగం ఎలాంటిదైనా సరే.. అందులో అణ్వాయుధాల గురించి, దాయాది దేశాల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. కానీ, తాజా ప్రసంగంలో అమెరికా, దక్షిణ కొరియాల ప్రస్తావన లేకుండానే ముగిసిపోవడం అధికారులను సైతం విస్మయపరిచింది. అణ్వాయుధ సంపత్తి, కవ్వింపు, దాడులు, చర్చలు.. ఇలాంటి అంశాలేవీ లేవు.
అయితే కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న అస్థిర సైనిక వాతావరణం కారణంగా.. ప్యోంగ్యాంగ్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని మాత్రం ఒక్క లైన్‌లో పేర్కొన్నాడు కిమ్. గత సోమవారం మొదలైన 8వ సెంట్రల్ కమిటీ 4వప్లీనరీ మీటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ యధాతధ ప్రసంగం పేరిట కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) పూర్తి కథనం ప్రచురించింది.
చదవండి: బఫూన్ అనుకుంటున్నావా?.. కిమ్ జోలికి రావొద్దు బ్రదర్
Comments
Please login to add a commentAdd a comment