మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ కోర్టు విచారణ సందర్భంగా తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ కుప్పకూలిపోవడంతో నా వల్ల చాలా మంది బాధపడ్డారు. అయితే, తానెవరినీ మోసం చేయలేదని, కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకోలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 83వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మోసానికి గాను ఏళ్ల తరబడి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో చేసిన నేరాన్ని తన ప్రియురాలు కరోలిన్ ఎల్లిసన్‌పై నెట్టాడు.
ప్రపంచ వ్యాప్తంగా 134 ఎఫ్‌టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు, 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు నష్టం’ వంటి కారణాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫ్రైడ్‌పై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ (టెలికమ్యూనికేషన్, టెక్నాలజీని వినియోగించి చేసే మోసం), మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందుకు డజనకుపైగా కేసులు నమోదు చేశాయి. వీటిపై న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్‌ను విచారిస్తుంది.
ప్రియురాల్ని ఇరికించి
తాజాగా,ఫెడరల్ కోర్టు నిర్వహించిన విచారణకు ఫ్రైడ్, అతని తరుపు వాదించే లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రైడ్‌ను విచారిస్తున్న న్యాయమూర్తులతో రిస్క్-మేనేజ్‌మెంట్ టీమ్‌ను నియమించుకోవడం వంటి తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సమయంలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తన ప్రియురాలు, 2017లో ఫ్రైడ్ స్థాపించిన ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్ సీఈవో కరోలిన్ ఎల్లిసన్‌ను ఇరికించారు.
ఆరు గంటల వాంగ్మూలంలో
‘మేం మార్కెట్‌లో అత్యుత్తమ ప్రొడక్ట్‌ను తయారు చేయగలమని భావించాము. కానీ ఊహించిన దానికి విరుద్ధంగా మారింది. దీంతో కస్టమర్‌లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. కంపెనీ దివాలా తీసింది’అని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో తన ఆరు గంటల వాంగ్మూలంలో చెప్పాడు. నేరం రుజువైతే దశాబ్ధాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తనపై నమోదైన డజనకు పైగా కేసుల్లో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు.
100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు
బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ ఫండ్‌లను అలమెడా రీసెర్చ్‌కు తరలించారని, ఎన్నికల ప్రచారం కోసం అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులకు 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారని ప్రాసిక్యూటర్‌లు ఆరోపించారు.
డిఫెన్స్ లాయర్ మార్క్ కోహెన్ ప్రశ్నలకు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ స్పందిస్తూ.. స్పాన్సర్‌షిప్‌లు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే నిధులు ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ల నుండి రాలేదని, కంపెనీ ఆదాయం,ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి పొందిన కమీషన‍్ల నుంచి వచ్చినట్లు తాను నమ్ముతున్నానని అన్నాడు. రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు తనకున్న ఆలమేడ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిపారు.
మొత్తం ప్రియురాలే చేసింది
2022 జూన్‌లో క్రిప్టో మార్కెట్ క్రాష్ అయ్యింది. దీంతో పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అల్మెడ బ్యాలెన్స్ షీట్‌లను తప్పుగా మార్చమని చెప్పినట్లు ఫ్రైడ్ వివరించాడు. ఆ బ్యాలెన్స్ షీట్‌లను చూసే అవసరలేదని భావించానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సుదీర్ఘ విచారణలో ఫ్రైడ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఎవరీ బ్యాంక్‌మన్-ఫ్రైడ్
క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్‌టీఎక్స్‌ను 2019లో బ్యాంక్‌మన్-ఫ్రైడ్ స్థాపించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఇది విస్తరించింది. 2014లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీని ఆయన పూర్తి చేశారు. అనంతరం క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. ఆయన సంపదలో అధిక మొత్తాన్ని స్వచ్ఛంద సేవకు ఇస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment