ఇటీవల కాలంలో భార్యకు వేధింపులు, ఇటు తల్లిదండ్రుల్ని వేధింపులకు గురిచేసిన రేమాండ్ గ్రూప్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా వార్తల్లోకెక్కారు. తాజాగా ఐటీ శాఖకు రూ.328 కోట్ల భారీ మొత్తంలో జరిమానా చెల్లించి చర్చాంశనీయంగా మారారు.
అంబానీతో పోటీ పడి
ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, సౌత్ ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా (రూ.12వేల కోట్లు). ముఖేష్ అంబానీతో పోటీ పడ్డ గౌతమ్ సింఘానియా అదే ప్రాంతంలో రూ.6 వేల కోట్లతో రెండో అతి పెద్ద ఇల్లు (జేకే హౌస్)ను నిర్మించారు. అయితే ఆ ఇంటిని మ్యూజియంలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అడ్డంగా దొరికిపోయారు. చివరికి వందల కోట్లలో భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వచ్చింది. ఇంతకి ఆయన ఏం చేసినట్లు.
సింఘానియా 2018 - 2021 వరకు విదేశాల నుంచి సుమారు 142 కార్లను భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. ఆ కార్లన్నీ ఈ జేకే హౌస్‌లోనే ఉంచారు. అప్పుడప్పుడు ఆ కార్లతో ముంబై రోడ్లపై చక్కెర్లు కొడుతూ హల్‌చల్ చేసేవారు.
గౌతమ్ సింఘానియాపై డీఆర్‌ఐ కన్ను
గౌతమ్ సింఘానియా వ్యవహారంపై భారత గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విభాగం అధికారులు ఓ కన్నేశారు. ఆయన ఏ కారు డ్రైవింగ్ చేస్తున్నా వాటి ఆధారాల్ని సేకరించారు. ఏ దేశం నుంచి ఏ కారును ఎంత మొత్తం కొనుగోలు చేశారో ఆరా తీశారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు గౌతమ్ సింఘానియా మొత్తం కార్ల కొనుగోలు భాగోతం తెరపైకి వచ్చింది. వెంటనే అధికారులు ఆయన నివాసం జేకే హౌస్‌లో సోదాలు నిర్వహించారు. డీఆర్‌ఐ అధికారుల సోదాల్లో విదేశాల్లో కార్లును భారీ మొత్తంలో కొనుగోలు చేసి.. వాటిని ధరల్ని తగ్గిస్తూ తప్పుడు ఇన్‌వాయిస్‌లు తయారు చేసినట్లు పలు ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా గౌతమ్ సింఘానియా ఆయా కార్ల కంపెనీలతో జరిపిన ఈమెయిల్స్, చాటింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు.
142 కార్లను కొన్నారు.. ఆపై
డీఆర్‌ఐ అంతర్గతంగా జరిపిన విచారణలో రేమాండ్ సీఎండీ మొత్తం 142 కార్లను విదేశాల్లో కొనుగోలు చేసి వాటిని భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. వాటిల్లో 138 వింటేజ్ వెహికల్స్, నాలుగు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాహనాలు ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మొత్తం 142 కార్లలో వింటేజ్ కార్లకు 251.5 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది.
వాటికి ఆయన కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని డీఆర్‌ఐ నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా ఖజానాకు రూ.229.72 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు తెలిపారు. ఇక రేమాండ్ సీఎండీ యూఏఈ, హాంగ్ కాంగ్, అమెరికాలో ఏ మాత్రం విలువలేని నామమాత్రపు కంపెనీలు, మధ్యస్థ కంపెనీల నుంచి కార్లను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపించారు.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు గాను సింఘానియాకు రూ.328 కోట్ల జరిమానా విధించారు. ఆ మొత్తంలో 15 శాతం వడ్డీ చెల్లించాలని గత ఏడాది జనవరిలో నోటీసులు పంపారు. తాజాగా, ఆ నోటీసులకు అనుగుణంగా రేమాండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా రూ.328 కోట్లు జరిమానా చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment