సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ దిగ్గజాలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ యూనిట్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఆర్‌ఆర్‌విఎల్‌లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది.
జియో తరువాత వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇవి వరుసగా ఆరో, ఏడు పెట్టుబడుల ఒప్పందాలు కావడం విశేషం జీఐసీ ప్రపంచ నెట్‌వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ తన సప్లై చైన్, స్టోర్ నెట్‌వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొనసాగిస్తూ కస్టమర్లు, వాటాదారులకు మరింత ప్రయోజనం కలగనుందని జీఐసీ సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు.
కాగా సిల్వర్ లేక్ ఆ తర్వాత కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి. మూడు వారాల్లో ఆరు డీల్స్ సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాకుగాను 3,675 కోట్ల రూపాయలు, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ 1,875 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌విఎల్ 3.38 బిలియన్ల డాలర్లతో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ ఇండియాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక సంస్థ. 12,000 స్టోర్లతో, 64 కోట్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద రీటైలర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment