న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ)కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా తొలిసారి ’గ్లోబల్ ఇండియాఏఐ 2023’ సదస్సును నిర్వహించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా ప్రణాళికలు ఉన్నట్లు మెయిటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ పరిశ్రమ వర్గాలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటారని వివరించారు. ఏటా తప్పనిసరిగా పాల్గొనాల్సిన ముఖ్యమైన కార్యక్రమంగా అంతర్జాతీయ ఏఐ పరిశ్రమ భావించేలా .. దీన్ని తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు.
కేంద్రం నిర్వహించిన సెమీకాన్ ఇండియా రెండు ఎడిషన్లతో భారత్‌కు అంతర్జాతీయ సెమీకాన్ మ్యాప్‌లో పటిష్టమైన చోటు దక్కిందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. అదే విధంగా, గ్లోబల్ ఇండియాఏఐ కూడా భారత ఏఐ వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందించగలదని చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment