
ఈ కేలండర్ ఏడాది(2020) తొలి 8 నెలల్లో 30 శాతం దూసుకెళ్లడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకున్న బంగారం ధరలు రెండు నెలలుగా నేలచూపులతో కదులుతున్నాయి. తాజాగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 దిగువకు చేరింది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి, ట్రేడర్ల లాభాల స్వీకరణ, డాలర్ బలపడటం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలయ్యేవరకూ సహాయక ప్యాకేజీపై చర్చించేదిలేదంటూ ప్రకటించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 94 దిగువనే కదులుతుండటం పసిడి ధరలకు చెక్ పెడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. పసిడికి 1840 డాలర్ల వద్ద బలమైన మద్దతు లభించే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. అయితే 1920 డాలర్లను దాటితేనే ర్యాలీ బాట పట్టే వీలున్నదని అభిప్రాయపడింది. ఇదే విధంగా 1840 డాలర్ల దిగువకు చేరితే మరింత నీరసించవచ్చని అంచనా వేసింది. ఇతర వివరాలు చూద్దాం..
నేలచూపులో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 68 క్షీణించి రూ. 49,980 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 121 నష్టపోయి రూ. 60,298 వద్ద కదులుతోంది.
బంగారం బోర్లా
బంగారం, వెండి ధరలు బుధవారం డీలాపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 478 నష్టపోయి రూ. 50,048 వద్ద ముగిసింది. తొలుత 50,361 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,880 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ స్వల్పంగా రూ. 152 క్షీణించి రూ. 60,419 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,932 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,338 వరకూ నీరసించింది.
నష్టాలలో
న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.12 శాతం నీరసించి 1,889 డాలర్ల దిగువకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.13 శాతం బలహీనపడి 1,885 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ నామమాత్ర నష్టంతో 23.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.