
ముంబై : కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తూ స్వర్ణంపై సామాన్యుడిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగివచ్చింది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 100 రూపాయలు దిగివచ్చి 50,373 రూపాయలకు తగ్గింది. ఇక కిలో వెండి 706 రూపాయలు పతనమై 60,610 రూపాయలు పలికింది. చదవండి : బంగారం.. క్రూడ్ బేర్..!
డాలర్ బలోపేతంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ నిపుణులు విశ్లేషించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 1900 డాలర్లకు తగ్గింది. యూరప్, బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసులు రెండోసారి భారీగా నమోదవుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా కరెన్సీ (డాలర్)ను ఎంచుకోవడంతో పసిడికి డిమాండ్ తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు.