ఆల్‌టైమ్ రికార్డు ధరలు
లక్షకు రూ.500 దూరంలో వెండి
న్యూఢిల్లీ: అటు బంగారం, ఇటు వెండి.. రెండు విలువైన మెటల్స్ ధరలు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపు రూ.79,900తో పోల్చితే సోమవారం రూ.750 పెరిగి రూ. 80,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర రూ.750 ఎగసి, రూ.80,250కి చేరింది. ఇక కేజీ వెండి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.5,000 పెరిగి రూ99,500కి ఎగసింది.
కారణాలు ఇవీ...
అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీన ధోరణి విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ వెండికి కలిసి వస్తున్న అంశం.
అంతర్జాతీయంగా రికార్డులు
పశి్చమ దేశాల సెంట్రల్ బ్యాంకుల సరళతర ఆర్థిక విధానాల నేపథ్యంలో సోమవారం యూరోపియన్ ట్రేడింగ్ గంటల్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 2,730 డాలర్ల స్థాయికి చేరింది. వెండి సైతం 3 శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 34.20 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రికార్డు ధర వద్ద 2,752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,755 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గత ముగింపుకన్నా ఇది 25 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.650 లాభంతో రూ. 78,380 రికార్డు ధర వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.2,500 లాభంతో రూ.98,000 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment