
న్యూయార్క్/ ముంబై : డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టత రావడంతో బంగారం, వెండి ధరలతోపాటు.. ముడిచమురు సైతం ‘జో’రందుకుంది. జో బైడెన్ విజయంపై అంచనాల నేపథ్యంలో వారాంతాన బంగారం, చమురు ధరలు బలపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు వేడెక్కాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1964 డాలర్లను అధిగమించగా.. వెండి 26 డాలర్లను తాకింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 40 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. దేశీయంగా వెండి కేజీ 66,000 మార్క్ ను దాటగా.. పసిడి 10 గ్రాములు రూ. 52,000 ఎగువన ట్రేడవుతోంది.
నిధుల ఆశలు
ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహద పడనుందన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలకడం కమోడిటీలకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం..
లాభాలతో..
దేశీయంగా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 223 పుంజుకుని రూ. 52,390 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,520 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 52,225 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 880 లాభపడి రూ. 66,215 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 66,390 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 65,849 వరకూ వెనకడుగు వేసింది.
కామెక్స్‌లో..
వారం చివర్లో జోరందుకున్న బంగారం ధరలు న్యూయార్క్ కామెక్స్‌లో మరోసారి బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.65 శాతం పుంజుకుని 1,964 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం లాభంతో 1,962 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 1.4 శాతం ఎగసి ఔన్స్ 26.01 డాలర్ల వద్ద కదులుతోంది.
చమురు వేడి
ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.8 శాతం జంప్ చేసి 38.18 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 2.55 శాతం ఎగసి 40.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment