
విదేశీ మార్కెట్లో ప్రతి రోజూ సరికొత్త రికార్డులను సాధిస్తున్న ధరలకు అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది. కాగా.. మంగళవారమే వెండి రూ. 4,000 జంప్‌చేయడం ద్వారా రూ. 76,000 మార్క్‌ను అధిగమించి దేశీయంగా సరికొత్త గరిష్టాన్ని సాధించింది. ఇంతక్రితం 2011 ఏప్రిల్ 25న రూ. 75,000 వద్ద వెండి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.
ఆరో రోజూ రికార్డ్స్
కోవిడ్-19 సృష్టిస్తున్న సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలలో ఆరో రోజూ ర్యాలీ కొనసాగుతోంది. బులియన్ చరిత్రలో గురువారం మరోసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2,081 డాలర్లకు ఎగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 2,068 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా మరోసారి ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఈ వారంలోనే పసిడి 4.7 శాతం జంప్‌చేయడం విశేషం! ఇక వెండి సైతం ఔన్స్ 2.5 శాతం ఎగసి 29.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది!
గురువారం సైతం..
దేశీయంగా ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి రూ. 747 లాభపడి రూ. 55,845 వద్ద నిలిచింది. తొలుత రూ. 56,079 వద్ద గరిష్టాన్ని తాకింది. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ధర రూ. 4,159 దూసుకెళ్లి రూ. 76,052 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 76,360 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్ 25న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 75,000ను సులభంగా దాటేసింది!
కారణాలేవిటంటే?
చైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నాయి. పలు దేశాలు లాక్‌డవున్‌లతో కరోనా వైరస్ కట్టడికి చర్యలు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా కేంద్ర బ్యాంకులు బిలియన్లకొద్దీ నిధులను నామమాత్ర వడ్డీలతో రుణాలుగా అందిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వాలు సైతం ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిధులు సంక్షోభ కాలంలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడివైపు అధికంగా మళ్లుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా ఈక్విటీలకూ ప్రవహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు తెలియజేశారు. బంగారాన్ని అధిక పరిమాణంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసే విషయం విదితమే. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లు భారీగా పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం.
డాలర్ ఎఫెక్ట్
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా రెండేళ్ల కనిష్టం వద్దే కదులుతోంది. దీంతో వరుసగా ఏడో వారంలోనూ నష్టాలతో ముగిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు యూఎస్ ట్రెజరీల ఈల్డ్స్ బలహీనపడుతున్నాయి. తాజాగా ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. ఇవన్నీ పసిడి ధరలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment