
సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతం అవుతుండటంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు వారాంతాన కోలుకున్నాయి. ఈ బాటలో తాజాగా మరోసారి లాభాల బాటలో సాగుతున్నాయి. అమెరికాలో రోజుకి దాదాపు లక్ష కేసులు నమోదవుతుంటే.. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలోనూ కరోనా వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాలు లాక్‌డవున్ విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలకు తెరతీస్తున్నాయి. ఫలితంగా తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన బాట పట్టనున్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు అంటు కేంద్ర బ్యాంకులు, ఇటు ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు మొగ్గు చూపే సంగతి తెలిసిందే. రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పసిడి ధరలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..
మరోసారి
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 45 పెరిగి రూ. 50,744 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 50,777 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,612 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 735 లాభపడి రూ. 61,600 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,857 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,362 వరకూ క్షీణించింది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలుకావడం గమనార్హం!
కామెక్స్‌లో..
రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ న్యూయార్క్ కామెక్స్‌లో వారాంతన బలపడిన బంగారం ధరలు మరోసారి లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.26 శాతం లాభంతో 1,884 డాలర్లకు చేరింది. వెండి 1.24 శాతం ఎగసి ఔన్స్ 23.94 డాలర్ల వద్ద కదులుతోంది.
లాభపడ్డాయ్
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 418 ఎగసి రూ. 50,700 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,870 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 748 పుంజుకుని రూ. 60,920 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 61,326 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ వెనకడుగు వేసింది.