
ముందురోజు ఉన్నట్లుండి కుప్పకూలిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా బలపడ్డాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో మళ్లీ పలు దేశాలు లాక్‌డవున్ ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలు తలెత్తడంతో సోమవారం ముడిచమురు ధరలు 5 శాతంపైగా పతనంకాగా.. పసిడి, వెండి ధరలు సైతం కుప్పకూలాయి. అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆరు వారాల గరిష్టానికి చేరింది. ఇది పసిడి, వెండి ధరలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..
లాభాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 137 పుంజుకుని రూ. 50,608 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 510 లాభంతో రూ. 61,826 వద్ద కదులుతోంది.
కోలుకున్నాయ్
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 లాభంతో 1,921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం బలపడి 1915 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 2 శాతం జంప్‌చేసి 24.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సోమవారం పతనం
ఎంసీఎక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 1244 క్షీణించి రూ. 50,471 వద్ద ముగిసింది. తొలుత 51,650 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,815 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 6,561 పడిపోయి రూ. 61,316 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 67,888 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 60,664 వరకూ పతనమైంది.
కామెక్స్‌లోనూ డీలా
న్యూయార్క్ కామెక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి 3 శాతం క్షీణించి 1,911 డాలర్లకు చేరగాగా.. స్పాట్ మార్కెట్లోనూ ఇదే స్థాయిలో నీరసించి 1912 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ఏకంగా 9.3 శాతం కుప్పకూలి 24.39 డాలర్ల వద్ద స్థిరపడింది.