
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు.
ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్‌టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment