న్యూఢిల్లీ: ఎట్టకేలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విటర్ కొనుగోలుకు బిలియనీర్ ఎలాన్ మస్క్ సిద్ధమవుతుండగా, ఉద్యోగులు ట్విటర్‌కు గుడ్‌పై చెబుతున్నారట. ముఖ్యంగా ట్విటర్ డీల్ పూర్తి అయిన తరువాత మస్క్ ఆధ్వర్యంలో 75 శాతం ఉద్యోగులపై వేటు తప్పదనే నివేదికల నేపథ్యంలో ఈ నెలలోనే 50 మంది ఉద్యోగులు రిజైన్ చేశారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందే కొన్ని నెలలుగా వందలాది మంది కంపెనీని విడిచిపెట్టారని డేటా విశ్లేషణ, పరిశోధనా సంస్థ Punks & Pinstripes తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం 7,500 మంది ఉద్యోగులలో, జనవరి నుండి 1,100 మందికి పైగా కంపెనీని విడిచిపెట్టారు. గత మూడు నెలలు లేదా 90 రోజులలో దాదాపు 530 మంది ఉద్యోగాలనుంచి నిష్క్రమించారని గుర్తించినట్టు తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీని వీడిన వారితో పోలిస్తే ఇది 60 శాతం అధికమని పేర్కొంది. అందులోనూ 44 బిలియన్ డాలర్ల విలువతో ట్విటర్ కొనుగోలు దాదాపు ఖరారైన తరుణంలో ఈ నెలలోనే 50 మంది ఉద్యోగులు గుడ్ బై చెప్పారని నివేదించింది.
వీరిని గూగుల్, మెటా వంటి ప్రధాన టెక్ కంపెనీలకు మారినట్లు వెల్లడించింది. లింక్డ్ఇన్ డేటా విశ్లేషణ ఆధారంగా ఎంత మంది ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు...ఏయే కంపెనీల్లో చేరుతున్నారు అనేది విశ్లేషించినట్టు తెలిపింది. వీరిలో 30 శాతం మంది ఉద్యోగులను టెక్‌దిగ్గజాలు గూగుల్ లేదా మెటాలో ఉద్యోగాలు సంపాదించగా, మరి కొందరు Pinterest, LinkedIn, TikTok, Snap వంటి కంపెనీలకు వెళ్లారు. కాగా గూగుల్, మెటా నియామకాలను నిలిపివేసినట్టు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజా రిపోర్టులపై ఈ టెక్ కంపెనీలు స్పందించేంతవరకు స్పష్టత రాదు.
Comments
Please login to add a commentAdd a comment