
న్యూఢిల్లీ: స్టీల్ ప్రొడక్టుల తయారీ కంపెనీ శ్రీ బాలాజీ వాల్వ్ కంపోనెంట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభంకానుంది. 29న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 95–100గా ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా 21.6 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 21.6 కోట్లు సమీకరించనుంది. కంపెనీ షేర్లు బీఎస్ ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్ట్‌కానున్నాయి. ఇష్యూ నిధులను పెట్టుబడి వ్యయాలు, అదనపు ప్లాంట్లు, మెషీన్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. విద్యుత్, నిర్మాణం, చమురుగ్యాస్, ఫార్మా రంగాలలో వినియోగించే వాల్వ్ సంబంధ పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది.
ఆఫిస్ స్పేస్ లిస్టింగ్ బాట
ఇటీవల పలు పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. తాజాగా ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్, గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ అందించే ఆఫీస్ స్పేస్ ఇష్యూలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ రెడీ
స్టాక్ మార్కెట్ సంబంధ సరీ్వసులందించే గ్రెటెక్స్ షేర్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 30.96 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. మార్కెట్ మేకింగ్, స్టాక్ బ్రోకింగ్, క్యాపిటల్ మార్కెట్ ఆఫర్లకు అండర్ రైటింగ్, ఎన్‌ఎస్‌డీఎల్‌కు డిపాజిటరీ పారి్టసిపెంట్లుగా సరీ్వసులు సమకూర్చుతోంది.