న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 6న ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285గా కంపెనీ ప్రకటించింది.
ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్‌దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. ఐపీవోలో భాగంగా 5న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్‌చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment