న్యూఢిల్లీ: వాటర్ హీటర్లు, గీజర్లు, రూమ్ హీటర్లు తదితర ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం శీతాకాలంలో (వింటర్) జోరుగా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం అమ్మకాలకు దన్నుగా నిలవనుంది. రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో, కంపెనీలు ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గమనార్హం. వింటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌కు పరిచేయం చేస్తున్నాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన గీజర్లను కూడా తీసుకొచ్చాయి. ట్యాంక్ రహిత ఇన్‌స్టంట్ వాటర్ హీటర్లను కూడా తీసుకొచ్చాయి. ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లతో కూడిన ఖరీదైన రూమ్ హీటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య వినియోగదారుల నుంచి, సంపన్న వినియోగదారుల వరకు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా.. సౌకర్యం, మన్నిక, డిజైన్లతో కూడిన ఉత్పత్తులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. (మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్)
20 శాతం వృద్ధిపై క్రాంప్టన్ కన్ను..
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (సీజీసీఈఎల్) అయితే, ఇన్‌స్టంట్, స్టోరేజ్ వాటర్ హీటర్ల అమ్మకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే రూమ్ హీటర్ల అమ్మకాల్లో 70 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కంపెనీ ఏడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. సోలారియం క్యూబ్ ఐవోటీ సిరీస్, సోలారియం కేర్ సిరీస్ నుంచి ఈ ఉత్పత్తులు ఉన్నాయి. బేబీ కేర్, హెయిర్ కేర్, హైజీన్ కేర్ అనే ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది వాటర్ హీటర్ల మార్కెట్ సైజ్ 10 శాతం వృద్ధితో 42.5 లక్షలుగా ఉంటుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. రూమ్ హీటర్ల మార్కెట్ 40 లక్షల యూనిట్లు కాగా, ఈ ఏడాది వృద్ధి చలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు.
ముందే సన్నద్ధం.. ‘‘వింటర్ సీజన్‌పైనే వ్యాపార వృద్ధి ఆధారపడి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైతే ఉత్పత్తులకు డిమాండ్ సహజంగానే అధికమవుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముందే తయారీ పరంగా తగినంత సన్నద్ధతతో ఉన్నాం’’అని బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీవోవో రవీందర్ సింగ్ నేగి వెల్లడించారు. రూమ్ హీటర్ల విభాగంలో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, కార్బన్ రూమ్ హీటర్లు, ఫ్యాన్ రూమ్ హీటర్లు, హాలోజెన్ రూమ్ హీటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను తాము ఆఫర్ చేస్తున్నట్టు నేగి తెలిపారు.
హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ ఈ విభాగంలో గడిచిన రెండేళ్లుగా రెండంకెల వృద్ధిని చూస్తున్నట్టు కంపెనీ సీఈవో రాకేశ్ కౌల్ చెప్పారు. ఈ ఏడాది 20 వరకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ మోడళ్లను విడుదల చేయడం ద్వారా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు. (సామాన్యుడికి ఊరట: 11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం)
Comments
Please login to add a commentAdd a comment