Amith Kishan Success Story: ఆధునిక పోటీ ప్రపంచంలో ఒకరి కంటే ఒకరు ముందుగా డెవలప్ అవ్వాలనే ఆలోచనల్లో పడి సంపాదన బాటలో పడి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలను వదిలి పెట్టి కేవలం డబ్బు వెంట పరుగెడుతూ తక్కువ వయసులోనే తనువు చాలిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా అందులోనే పడి బతికేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి బాగా సంపాదిస్తూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ అతడెవరు? అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బ్యాంక్ ఉద్యోగం..
నివేదికల ప్రకారం, కర్ణాటక చిక్కబళ్ళాపూర్ ప్రాంతానికి చెందిన 'అమిత్ కిషన్' (Amith Kishan) చదువు పూర్తయిన తరువాత చాలా సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసాడు. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ, బజాజ్, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి వాటిలో పనిచేశాడు.
నిజానికి అమిత్ తాత గారు వ్యవసాయంలో దిట్ట, చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పలుకుబడి ఉండేది. ఈ కారణంగానే అమిత్ కిషన్‌కి కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతనికి వ్యవసాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. ''డబ్బు సంపాదిస్తున్నాము, కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నామనేది'' అతని మనసులో ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న. అదే సమయంలో అతని మిత్రుడు అనారోగ్యంతో చనిపోవడం అతన్ని మరింత కృంగదీసింది.
ఉద్యోగానికి రాజీనామా..
సుమారు ఎనిమిది సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసిన అమిత్ వ్యవసాయం చేయడానికి ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఆ తరువాత తాతగారి ఊరిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. దీనికి అతని తమ్ముడు అశ్రిత్ చాలా సహకరించాడు. వీరిరువురు మిర్చి, వేరుశెనగ వంటి పంటలు చేయడం మొదలు పెట్టారు. అయితే సీజన్ల విషయంలో అవగాహన లేకపోవడంతో మొదట వైఫల్యమే ఎదురైంది. ఆ తరువాత వ్యవసాయం గురించి మరింత తెలుసుకోవడం ప్రారంభించారు.
సేంద్రియ వ్యవసాయం..
సేంద్రియ వ్యవసాయం చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు, కానీ దీని కోసం భూమిని నాలుగు అడుగులు తవ్వి అందులో రసాయనాలకు బదులు ఆవు పేడ, మూత్రం వంటి వాటితో పాటు అరటిపండు తొక్కలు కూడా వేసాడు. ఈ ఆలోచన చాలా బాగా సక్సెస్ అయింది. భూమిని సారవంతం చేయడంలో ఇది చాలా ఉపయోగపడింది.
(ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!)
సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించిన భూమిలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో రూ. 1.5 కోట్లతో సుమారు 15 ఎకరాల భూమితో ప్రారంభమైన వీరి వ్యవసాయం ఇప్పుడు ఏకంగా 600 ఎకరాలకు విస్తరించింది. వీరి పొలాల్లో ఉపయోగించడానికి సేంద్రియ ఎరువుల కోసం ఆవులు, గేదెలను కూడా వారే పెంచుతున్నారు. సుమారు ఇవన్నీ 700 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - మెటా థ్రెడ్స్‌లో యూట్యూబర్ హవా!)
హెబ్పేవు ఫామ్స్ & సూపర్ మార్కెట్..
ఒక పక్క సేంద్రియ వ్యవసాయం, మరో వైపు పాల వ్యాపారం కూడా బాగా సాగింది. వీరి వ్యాపారానికి హెబ్పేవు ఫామ్స్, హెబ్పేవు సూపర్ మార్కెట్ అని పేరు పెట్టారు. వ్యవసాయం బాగా విస్తరించిన తరువాత వార్షిక ఆదాయం రూ. 21 కోట్లకు చేరింది. ప్రస్తుతం వీరి వద్ద 120 మంది వ్యక్తులతో ఒక టీమ్ ఉంది. అంతే కాకుండా వీరి వ్యవసాయ క్షేత్రంలో 3000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. హెబ్పేవు ఉత్పత్తులు బెంగళూరు వంటి నగరాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment