అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్‌లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది.
టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 34.2 శాతం
కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది.
యాక్సిస్ బ్యాంక్ 35 శాతం
ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు.
యస్ బ్యాంక్ 43 శాతం
ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే..
Comments
Please login to add a commentAdd a comment