కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, సెస్‌లతోపాటు ఇతర మార్గాల్లో నిధులు సమకూరుతుంటాయి. అయితే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రానిదే మేజర్ వాటా. ఆ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో ఉంటే అవి ఇన్వెస్టర్లకు డివిడెండ్ల రూపంలో నగదు బదిలీ చేస్తాయి. దాంతో కేంద్రానిదే అధిక వాటా ఉంటుంది కాబట్టి భారీగా నిధులు సమకూరుతాయి.
ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్‌లో నిర్దేశించిన అంచనాల్ని మించి చెల్లింపు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకూ డివిడెండ్లు వస్తాయని ఆ వర్గాలు వివరించాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.43,000 కోట్ల డివిడెండ్ మొత్తాన్ని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి మించి ఈ ఏడాది అదనంగా రూ.12,000-17,000 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పీఎస్‌యూల నుంచి రూ.43,800 కోట్ల డివిడెండు మొత్తం కేంద్రానికి అందింది. పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఆ లోటును డివిడెండ్లు పూడుస్తాయని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
కొన్ని ప్రభుత్వ సంస్థలు లాభాల భాటపడుతూ కేంద్రానికి భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. అయితే ఇంకొన్ని కంపెనీల్లో ప్రభుత్వం వాటా విక్రయించడం ద్వారా రానున్న రోజుల్లో కేంద్రానికి వచ్చే మొత్తంలో కోత పడనుందని నిపుణులు చెబుతున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో వాటాలు అమ్మి రూ.51,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల రూ.30,000 కోట్లు కూడా రావడం కష్టమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ వాటాల విక్రయంతో రూ.10,500 కోట్లు మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ప్రస్తుతం ఎనిమిది ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదన వివిధ దశల్లో ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment