ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్ సుబ్రమణియన్‌ను నేడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అదిరిపోయే ఒక ట్విస్ట్ బయటపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ నిర్ణయాలను గత కొన్ని ఏళ్లుగా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదృశ్య "హిమాలయ యోగి" ఎవరు అనేది తెలిసిపోయింది.
స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కేసులో అరెస్టయిన మాజీ అధికారి ఆనంద్ సుబ్రమణియన్ అదృశ్య "హిమాలయ యోగి" అని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ చిత్ర రామకృష్ణతో ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసిన "యోగి" అని సీబీఐ వర్గాలు ఈ రోజు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఆనందే అదృశ్య"హిమాలయ" యోగి అనే విషయం ఖరారైనట్లు తెలుస్తుంది. యోగి పేరుతో చిత్ర రామకృష్ణ తీసుకున్న నిర్ణయాలలో ఆయన వివాదాస్పద నియామకం ఒకటి అని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒక నివేదికలో తెలిపింది.
ఆనంద్ సుబ్రమణియన్ ఒక ఇమెయిల్ ఐడీ ద్వారా తనను తాను యోగి అని వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది. సుబ్రమణియన్ మెయిల్ ఐడీని rigyajursama@outlook.com సృష్టించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది. చిత్ర రామకృష్ణ 2013 -2016 మధ్య కాలంలో rigyajursama@outlook.comకు చిత్ర రామకృష్ణ rchitra@icloud.com మెయిల్ ఐడీ నుండి ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పంచుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మెయిల్స్'లో కొన్ని ఆనంద్ సుబ్రమణియన్ మరొక మెయిల్ ఐడీకి కూడా మార్క్ చేయబడినట్లు సమాచారం. సుబ్రమణియన్ మెయిల్ ఐడీల నుంచి ఈ మెయిల్స్ స్క్రీన్ షాట్'లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.
సుబ్రమణియన్'ను సీబీఐ గత వారం నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చెన్నైలో అతన్ని అరెస్టు చేశారు. "సుబ్రమణియన్ విచారణకు సహకరించలేదు; అతను తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడు" అని సీబీఐ వర్గాలు తెలిపాయి. సుబ్రమణియన్ మొదటిసారి 2013లో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్'గా నియమితులయ్యారు. ఆ తర్వాత చిత్ర రామకృష్ణ 2015లో అతన్ని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్'గా పదోన్నతి కల్పించారు. 2016లో అవకతవకల ఆరోపణలు రావడంతో ఎన్ఎస్ఈని ఆనంద్ విడిచిపెట్టాడు. గత కొద్ది రోజులుగా జరగుతున్న విచారణలో చిత్ర రామకృష్ణ "యోగి"తో రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు దర్యాప్తులో ఉంది.
ఆ యోగీ ప్రభావం వల్ల ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని ఆనంద్ సుబ్రమణియన్'ని చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమించారని దర్యాప్తులో భాగంగా సెబీ తెలిపింది. అలాగే, తన పనితో సంబంధం లేకుండా చిత్ర రామకృష్ణ భారీ స్థాయిలో జీతాలు పెంచారు అని కూడా తేలింది. సుబ్రమణియన్ నియామకం, ప్రమోషన్ విషయంలో ఆరోపణలు రావడంతో చిత్ర రామకృష్ణ, ఇతరులపై సెబీ అభియోగాలు మోపింది. ఇమెయిల్స్ ఆధారంగా, శ్రీమతి రామకృష్ణ ఈ వ్యక్తిని "2015లో అనేకసార్లు" కలుసుకున్నట్లు సెబీ పేర్కొంది. చిత్ర రామకృష్ణ 2013 నుంచి 2016 వరకు ఎన్‌ఎస్‌ఈకి నాయకత్వం వహించారు.
(చదవండి: NSE Scam: యోగి సత్యం! మెయిల్ మిథ్య?)
Comments
Please login to add a commentAdd a comment