Anand Subramanian
-
మిస్టర్ ఆనంద్ సుబ్రమణియన్ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే?
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ని పట్టి కుదిపేస్తున్న కో లోకేషన్ కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఎస్ఈకి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రమణియన్ పని చేసిన కాలంలో పక్కదారి పట్టిన రూ.2.05 కోట్ల రూపాయలను 15 రోజుల్లోగా చెల్లించాలంటూ సెబీ నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఈ డబ్బులు చెల్లించకపోతే ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాల స్థంభన, అరెస్టు వంటివి ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ ఘాటుగా హెచ్చరించింది. సెబీ ఎండీగా చిత్ర రామకృష్ణ, ఆమెకు అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌లు పని చేసిన కాలంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సెబీ, సీబీఐలు విచారణ చేస్తున్నాయి. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అడ్వెజర్‌గా ఉన్న ఆనంద్ సుబ్రమణియన్‌ను ఆ తర్వాత కాలంలో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవిని కూడా కట్టబెట్టారు. సెబీ విచారణలో అవినీతి విషయం వెలుగు చూడటంతో గత ఫిబ్రవరిలో రూ. 2 కోట్లు ఫైన్ విధించగా సకాలంలో చెల్లించలేదు. దీంతో జరిమానాతో పాటు అరెస్టు చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది సెబీ. చదవండి: Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ -
ఎన్ఎస్ఈ కుంభకోణం కేసులో అదిరిపోయే ట్విస్ట్.. అతడే "అదృశ్య" యోగి!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్ సుబ్రమణియన్‌ను నేడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అదిరిపోయే ఒక ట్విస్ట్ బయటపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ నిర్ణయాలను గత కొన్ని ఏళ్లుగా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదృశ్య "హిమాలయ యోగి" ఎవరు అనేది తెలిసిపోయింది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కేసులో అరెస్టయిన మాజీ అధికారి ఆనంద్ సుబ్రమణియన్ అదృశ్య "హిమాలయ యోగి" అని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ చిత్ర రామకృష్ణతో ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసిన "యోగి" అని సీబీఐ వర్గాలు ఈ రోజు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఆనందే అదృశ్య"హిమాలయ" యోగి అనే విషయం ఖరారైనట్లు తెలుస్తుంది. యోగి పేరుతో చిత్ర రామకృష్ణ తీసుకున్న నిర్ణయాలలో ఆయన వివాదాస్పద నియామకం ఒకటి అని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒక నివేదికలో తెలిపింది. ఆనంద్ సుబ్రమణియన్ ఒక ఇమెయిల్ ఐడీ ద్వారా తనను తాను యోగి అని వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది. సుబ్రమణియన్ మెయిల్ ఐడీని rigyajursama@outlook.com సృష్టించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది. చిత్ర రామకృష్ణ 2013 -2016 మధ్య కాలంలో rigyajursama@outlook.comకు చిత్ర రామకృష్ణ rchitra@icloud.com మెయిల్ ఐడీ నుండి ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పంచుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మెయిల్స్'లో కొన్ని ఆనంద్ సుబ్రమణియన్ మరొక మెయిల్ ఐడీకి కూడా మార్క్ చేయబడినట్లు సమాచారం. సుబ్రమణియన్ మెయిల్ ఐడీల నుంచి ఈ మెయిల్స్ స్క్రీన్ షాట్'లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. సుబ్రమణియన్'ను సీబీఐ గత వారం నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చెన్నైలో అతన్ని అరెస్టు చేశారు. "సుబ్రమణియన్ విచారణకు సహకరించలేదు; అతను తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడు" అని సీబీఐ వర్గాలు తెలిపాయి. సుబ్రమణియన్ మొదటిసారి 2013లో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్'గా నియమితులయ్యారు. ఆ తర్వాత చిత్ర రామకృష్ణ 2015లో అతన్ని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్'గా పదోన్నతి కల్పించారు. 2016లో అవకతవకల ఆరోపణలు రావడంతో ఎన్ఎస్ఈని ఆనంద్ విడిచిపెట్టాడు. గత కొద్ది రోజులుగా జరగుతున్న విచారణలో చిత్ర రామకృష్ణ "యోగి"తో రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు దర్యాప్తులో ఉంది. ఆ యోగీ ప్రభావం వల్ల ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని ఆనంద్ సుబ్రమణియన్'ని చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమించారని దర్యాప్తులో భాగంగా సెబీ తెలిపింది. అలాగే, తన పనితో సంబంధం లేకుండా చిత్ర రామకృష్ణ భారీ స్థాయిలో జీతాలు పెంచారు అని కూడా తేలింది. సుబ్రమణియన్ నియామకం, ప్రమోషన్ విషయంలో ఆరోపణలు రావడంతో చిత్ర రామకృష్ణ, ఇతరులపై సెబీ అభియోగాలు మోపింది. ఇమెయిల్స్ ఆధారంగా, శ్రీమతి రామకృష్ణ ఈ వ్యక్తిని "2015లో అనేకసార్లు" కలుసుకున్నట్లు సెబీ పేర్కొంది. చిత్ర రామకృష్ణ 2013 నుంచి 2016 వరకు ఎన్ఎస్ఈకి నాయకత్వం వహించారు. (చదవండి: NSE Scam: యోగి సత్యం! మెయిల్ మిథ్య?) -
ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నించింది. ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాలపై ఆమెను విచారించింది. అయితే, ఈ కేసులో చిత్రా రామకృష్ణతో పాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికి సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. ఎన్ఎస్ఈలో అవినీతి, అక్రమాలు పాల్పడినందుకు 2018లోనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఎన్ఎస్ఈ సీఈఓగా కొనసాగుతున్న కాలంలో ఒక గుర్తు తెలియని హిమాలయన్ "యోగి" చెప్పినందుకు ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడంతో పాటు సుబ్రమణియన్‌కు ఏడాది కాలంలోనే పదోన్నతులు ఇచ్చినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. చిత్ర రామకృష్ణ గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. (చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది సీబీఐ. స్టాక్ మార్కెట్లో ముందస్తుగా యాక్సెస్ పొందడం ద్వారా లాభాలు పొందడానికి ఎన్ఎస్ఈలో కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చినందుకు ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని & ప్రమోటర్ సంజయ్ గుప్తా, ఇతరసంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎన్ఎస్ఈ సర్వర్ ఆర్కిటెక్చర్‌గా పనిచేసే సంజయ్.. గుర్తు తెలియని అధికారులతో కలిసి కుట్రలో పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎన్ఎస్ఈ, సెబీకి చెందిన మరికొంతమందిని ప్రశ్నించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!) -
చిత్రా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ/ముంబై: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ, గ్రూప్ మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌కి చెందిన ముంబై, చెన్నై నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబై విచారణ విభాగం ఇందులో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. ఎక్సే్చంజీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం ద్వారా వీరిద్దరూ అక్రమంగా లబ్ధి పొంది ఉంటా రన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరిపై ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత ఆరోపణలను నిర్ధా రించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించేందుకు నిర్వహించిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ నేపథ్యం..: 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే నిబంధనలను పక్కన పెట్టి, ఎవరో అజ్ఞాత, అదృశ్య హిమాలయ యోగి సూచనల మేరకు ఆనంద్ సుబ్రమణియన్‌ను జీవోవోగా, ఆ తర్వాత ఎండీకి సలహాదారుగా నియమించారంటూ చిత్రపై ఆరోపణలు ఉన్నాయి. పైపెచ్చు ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారమంతటినీ సదరు యోగికి చేరవేయడంతో పాటు ఉద్యోగుల పనితీరు మదింపులోనూ ఆయన సలహాలు తీసుకుని, వాటిని అమ లు చేశారని సెబీ తన విచారణలో నిర్ధారించింది. ఇంత జరిగినా ఆ యోగి వివరాలను వెల్లడించని చిత్రా రామకృష్ణ.. ఆ అజ్ఞాత వ్యక్తి నిరాకారులని, తనకు ఆధ్యాత్మిక శక్తిలాంటి వారని మాత్రమే విచారణలో చెప్పారు. దీంతో, ఈ మొత్తం వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పాలనా లోపాలు జరిగాయంటూ ఆమెతో పాటు మరికొందరు అధికారులను సెబీ ఆక్షేపించింది. చిత్రాకు రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ, సుబ్రమణియన్, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్‌పై తలో రూ.2 కోట్ల జరిమానా వి ధించింది. దీంతోపాటు పలు ఆంక్షలు విధించింది. -
హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ వివాదాస్పద నియామకం కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు రూ. 3 కోట్లు, ఎన్ఎస్ఈకి .. సుబ్రమణియన్‌కు.. మరో మాజీ ఎండీ, సీఈవో రవి నారాయణ్‌కు తలో రూ. 2కోట్లు, మాజీ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ వీఆర్ నరసింహన్‌కు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా రామకృష్ణ, సుబ్రమణియన్ .. మూడేళ్ల పాటు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ లేదా సెబీ దగ్గర నమోదైన ఇతర మధ్యవర్తిత్వ సంస్థతో కలిసి పనిచేయకుండా నిషేధం విధించింది. నారాయణ్ విషయంలో ఇది రెండేళ్లుగా ఉంది. అటు కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకుండా ఎన్ఎస్ఈపై సెబీ ఆరు నెలలు నిషేధం విధించింది. కుట్ర కోణం.. ఈ మొత్తం వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేశారని సెబీ వ్యాఖ్యానించింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి) అన్నింటినీ యోగికి ఆమె చేరవేసేవారని, ఆఖరుకు ఉద్యోగుల పనితీరు మదింపు విషయంలో కూడా ఆయన్ను సంప్రదించేవారని.. సెబీ 190 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. యోగి సూచనల మేరకే ఆనంద్‌ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని తెలిపింది. ‘ముగ్గురి మధ్య జరిగిన ఈమెయిల్ సంప్రదింపులను చూస్తే గుర్తు తెలియని వ్యక్తితో (యోగి) చిత్ర, ఆనంద్ కుమ్మక్కై చేసిన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్‌కు చిత్ర జీతభత్యాలు పెంచేవారు, అందులో నుంచి కొంత భాగాన్ని సదరు గుర్తు తెలియని వ్యక్తికి ఆనంద్ చెల్లించేవారు‘ అని వ్యాఖ్యానించింది. ఈ అవకతవకలన్నీ తెలిసినా, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్ సహ ఇతరత్రా అధికారులెవరూ గోప్యనీయ సమాచారం పేరిట ఆ వివరాలేవి రికార్డుల్లో పొందుపర్చలేదని సెబీ ఆక్షేపించింది. వివరాల్లోకి వెడితే.. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే 2013లో ఆనంద్ సుబ్రమణియన్ రూ.1.68 కోట్ల వార్షిక వేతనంతో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటెజిక్ అడ్వైజరుగా నియమితులయ్యారు. అప్పుడు ఆయన బామర్ అండ్ లారీ అనే సంస్థలో రూ. 15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి మేనేజరుగా ఉన్నారు. పైగా క్యాపిటల్ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేదు. అయినా ఆయన్ను పిలిచి మరీ ఎన్ఎస్ఈలో కీలక హోదా కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వేతనం విడతల వారీగా 2016 నాటికి రూ. 4.21 కోట్లకు పెరిగింది. అప్పటికి ఆయన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన్ను ఎప్పటికప్పుడు అత్యుత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగిగా ప్రచారం చేసినా, ఎక్కడా ఆయన పనితీరు మదింపు చేసిన ఆధారాలేమీ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
గ్యారంటీ లేకుండానే కారు లోన్
ఎస్బీఐతో ఓలా క్యాబ్స్ ఒప్పందం లక్ష మందిని సొంత కారు ఓనర్లుగా మార్చడమే లక్ష్యం సంస్థ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ డ్రైవర్లను సొంత కార్లు కలిగిన వారిగా తీర్చిదిద్దాలని ఓలా క్యాబ్స్ నిర్ణయించింది. ఇందుకోసం ఎస్బీఐతో ‘ఓలా ప్రగతి’ పేరుతో కార్లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో లక్ష మంది డ్రైవర్లను సొంత కార్లు కలిగిన యజమానులుగా తీర్చిదిద్దనున్నట్లు ఓలా క్యాబ్స్ డెరైక్టర్ (మార్కెటింగ్) ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ డ్రైవర్లను అనేక సొంత కార్లు కలిగిన యజమాన్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం అన్నారు. ఇందుకోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామని, ఈ ఒప్పందం ప్రకారం తాము ఎంపిక చేసిన డ్రైవర్లకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా ఎస్బీఐ కార్లోన్ అందిస్తుందన్నారు. కేవలం 10 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించి 3 నుంచి 5 ఏళ్ళలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీ వాయిదాల్లో లేదా 15 రోజులకు ఒకసారి చెల్లించవచ్చు. వడ్డీరేటు కాలపరిమితిని బట్టి 13-13.5 శాతంగా ఉంటుంది.3 లక్షల క్యాబ్స్ లక్ష్యం: ద్వితీయ శ్రేణి నగరాలకు క్యాబ్ సేవలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో మరో 120 పట్టణాలకు విస్తరించడమే కాకుండా అదనంగా మరో 2 లక్షల కార్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఓలా క్యాబ్స్ 85 పట్టణాల్లో లక్ష కార్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయిదు పట్టణాల్లో తాము సేవలను అందిస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ నెట్‌వర్క్‌లో 7,000 కార్లు ఉన్నాయని, ఏడాదిలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని ఆనంద్ వ్యక్తం చేశారు.