న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్నాటకలోని నర్సాపుర ప్లాంటులో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు వెల్లడించింది. ఈ ఫెసిలిటీ నుంచి తొలి రెండు ఎలక్ట్రిక్ మోడళ్లు 2023–24లో రోడ్డెక్కనున్నాయి. మధ్యస్థాయి మోడల్‌తోపాటు వాహనం నుంచి వేరు చేయగలిగే బ్యాటరీతో సైతం ఈవీ రానుంది.
(UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్‌పీసీఐ వివరణ)
2030 నాటికి 10 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. బ్యాటరీ, మోటార్, పీసీ యూ వంటి కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సు షి ఒగటా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6,000 కంపెనీ టచ్ పాయింట్లలో చార్జింగ్ సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఫిల్లింగ్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, ఇతర ప్రాంతాల్లో సైతం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు.
రెండు కొత్త మోడళ్లు..
గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంటులో స్కూటర్ల తయారీకై కొత్త లైన్‌ను జోడించనున్నట్టు ఒగటా వెల్లడించారు. తద్వారా అదనంగా 6 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం తోడవుతుందని చెప్పారు. నర్సాపుర ప్లాంటు నుంచి యాక్టివా స్కూటర్ల తయారీని గుజరాత్ ప్లాంటుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా 160 సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను మూడు నెలల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. పండగల సీజన్ నాటికి 350 సీసీ బైక్ ఒకటి రానుంది.
(జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్)
కాగా, భారత్‌లో కంపెనీకి ఉన్న నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 52 లక్షల యూనిట్లు. 2022–23లో హెచ్‌ఎంఎస్‌ఐ దేశీయంగా 40 లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీ 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 మోడళ్లను 58 దేశాలకు చేర్చాలన్నది సంస్థ ఆలోచన. అంతర్జాతీయంగా 2040 నాటికి ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ మోడళ్ల విక్రయాలు 100 శాతానికి చేర్చాలన్నది హోండా ధ్యేయం.
Comments
Please login to add a commentAdd a comment