
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. 2021 నుంచి 2023 మధ్య ఇళ్ల ధరలు ఏకంగా 20 పెరిగినట్లు హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ క్రెడాయ్ (CREDAI) నివేదిక ద్వారా తెలిసింది.
దేశంలో నిర్మాణ వ్యయం పెరగటం మాత్రమే కాకుండా.. ఇళ్ల కొనుగోళ్ళకు కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున ఎగబడటమే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో సుమారు 8 పెద్ద నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలిసింది.
ముఖ్యంగా బెంగళూరులో 2021 - 2023 కాలంలో ఇళ్ల ధరలు 31 శాతం పెరిగాయి. వైట్‌ఫీల్డ్, కెఆర్ పురం, సర్జాపూర్ వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంది, ప్రత్యేకించి లగ్జరీ సెగ్మెంట్‌లో కొత్త లాంచ్‌లు పెరగటం వల్ల కూడా ధరలు ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల విషయానికి వస్తే.. 2021 కంటే 2023లో గృహాల ధరలలో 2 శాతం పెరుగుదల ఉందని నివేదికలో స్పష్టమైంది. కరోనా మహమ్మారి తగ్గిన తరువాత ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి.
ఇదీ చదవండి: గోడ కట్టేస్తున్న రోబోట్.. వీడియో వైరల్
హైదరాబాద్‌లో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న విల్లాలు, రూ. 50 లక్షల లోపు ఉన్న అపార్ట్‌మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ధరలు 20 శాతం పెరగటం వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.