ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే! | How to do cryptocurrency trading and awareness how does it work? | Sakshi
Sakshi News home page

ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!

Published Mon, Jul 18 2022 12:22 PM | Last Updated on Mon, Jul 18 2022 12:57 PM

How to do cryptocurrency trading and awareness how does it work? - Sakshi

క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్‌ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్‌ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ 620 బిలియన్‌ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్‌ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్‌ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్‌ 11న బిట్‌ కాయిన్‌ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది.
   
గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి.  కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్‌ అంటూ ఏమీ లేవు. 

నియంత్రణలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్‌ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్‌బుక్‌ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది.

కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్‌ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారిత ‘టాన్‌’ను నిలిపివేయాలని యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించింది’’అని వజీర్‌ఎక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజగోపాల్‌ మీనన్‌ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్‌బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి.

క్రిప్టో కరెన్సీ  ట్రేడింగ్‌ గమనించాల్సిన ముఖ్య విషయాలు

► ఫండమెంటల్స్‌ లేని సాధనాలు
స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ
నియంత్రణల్లేని చోట రిస్క్‌ అపరిమితం
అంత రిస్క్‌ భరించే  రిటైల్‌ ఇన్వెస్టర్లు తక్కువ
ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు
నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం
అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement