
ఇళ్లల్లోను, ఆఫీసుల్లోను ఎయిర్ కండిషనర్లను అమర్చుకోవడం చాలా కష్టమైన పని. ఇవి భారీగా ఉండటం ఒక కారణమైతే, ఒకసారి ఒకచోట అమర్చుకున్న ఎయిర్ కండిషనర్‌ను మరో చోటుకు తరలించడం వీటిలో ఎదురయ్యే మరో సమస్య.
సాధారణ ఎయిర్ కండిషనర్లతో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ఇటాలియన్ డిజైనర్ మిరే ఓజ్లెమ్ ఈఆర్ ఇటీవల ఈ రోబో ఎయిర్ కండిషనర్‌కు రూపకల్పన చేసింది. గోళాకారంలో తయారు చేసిన ఈ రోబో ఏసీ చాలా తేలికగా ఉంటుంది. ఇందులోని థెర్మల్ కెమెరా గది వాతావరణంలోని ఉష్ణోగ్రతను గుర్తించి, ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో కోరుకున్న రీతిలో ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి కూడా వీలుంటుంది.
దీని డిస్‌ప్లే స్క్రీన్ మీద ఉష్ణోగ్రత కనిపిస్తుంది. దీని అడుగున ఉన్న చక్రాల స్టాండ్ ఎత్తును కావలసిన రీతిలో పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనిలో కోరుకున్న పరిమళాలను నింపుకుంటే, వాటిని నిదానంగా వెదజల్లే డిఫ్యూజర్ కూడా ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ రోబో ఏసీ గది అంతా కలియదిరుగుతూ క్షణాల్లోనే వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఇది ఇంకా మార్కెట్‌లోకి విడుదల కావాల్సి ఉంది.