సాక్షి, హైదరాబాద్ : ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్ చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్స్ తయారీకై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. ఫావిజెన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది. హైదరాబాద్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి పొందిన కంపెనీ ఫెసిలిటీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని జెనరా కో–ఫౌండర్, ఎండీ జగదీశ్ బాబు రంగిశెట్టి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. (కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్)
‘ధర విషయంలో ఆసుపత్రులు, పలు సంస్థలతో మాట్లాడుతున్నాం. రోగులకు అందుబాటులో ధర ఉండాలన్నదే మా ధ్యేయం. డబ్బులు వెచ్చించలేని వారికి తగ్గింపు ధరలో లేదా ఉచితంగా సరఫరా చేసేందుకూ మేం సిద్ధం. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్‌తయారీకి కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా ఉత్పత్తి చేశాం. మా వద్ద ఉన్న నిల్వలతో నాలుగు లక్షల మంది రోగులకు సరిపడ ట్యాబ్లెట్లను తయారు చేయవచ్చు’ అని వివరించారు. (ఫావిపిరవిర్‌కి ఆవ్రా ల్యాబ్‌కు అనుమతి)
కొత్త విభాగాల్లోకి బయోఫోర్..: న్యూట్రాస్యూటికల్స్, ఇమ్యూన్ బూస్టర్స్ విభాగాల్లోకి బయోఫోర్ త్వరలో ఎంట్రీ ఇస్తోంది. తొలుత ఆరు రకాల ఉత్పత్తులను విడుదల చేయనున్నామని జగదీశ్ బాబు వెల్లడించారు. వీటి ధర రూ.100–200 శ్రేణిలో ఉంటుందని వివరించారు. బయోఫోర్‌కు చెందిన హైదరాబాద్ ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment